తన పిల్లలకు ధోనీని చూపించడానికి ఓ తండ్రి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

by Harish |   ( Updated:2024-04-14 15:02:40.0  )
తన పిల్లలకు ధోనీని చూపించడానికి ఓ తండ్రి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
X

దిశ, స్పోర్ట్స్ : ఎం.ఎస్ ధోనీకి ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతన్ని చూడటానికే ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్లేవాళ్లు ఎంతో మంది. అందుకోసం ఫ్యాన్స్ ఎంతకైనా తెగిస్తారు. ఓ అభిమాని కూడా అలాంటి పనే చేశాడు. బ్లాక్‌లో టికెట్లు కొని తన పిల్లలతో కలిసి మ్యాచ్‌కు వెళ్లాడు. బ్లాక్‌లో టికెట్లు కొనడం కామనే కదా అనుకోవచ్చు. అయితే, బ్లాక్‌లో టికెట్లు కొనడానికి అతను చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే. ఆ టికెట్ల ధర రూ.64 వేలు. అందుకు అతను తన పిల్లల స్కూల్ ఫీజు డబ్బులను వినియోగించాడట.

ఈ విషయాన్ని సదరు వ్యక్తి స్వయంగా స్పోర్ట్ వాక్ చెన్నయ్ అనే చానల్‌కు తెలిపాడు. ‘నాకు టికెట్లు దొరకలేదు. అందుకే బ్లాక్‌లో కొన్నాను. మొత్తం రూ.64 వేలు. నేను ఇంకా స్కూల్ ఫీజు కొట్టలేదు. కానీ, తర్వాత కట్టాలని నిర్ణయించుకున్నా. ధోనీని ఒక్కసారైన చూడాలనుకున్నాం. ధోనీని చూసినందుకు నా ముగ్గురు కూతుళ్లు, నేను చాలా సంతోషంగా ఉన్నాం.’ అని సదరు అభిమాని తెలిపాడు. తన కూతురు మాట్లాడుతూ..‘ఈ టికెట్ల కోసం మా నాన్న చాలా కష్టపడ్డాడు. ధోనీ ఆడేందుకు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించాం.’ అని చెబుతూ ధోనీపై అభిమానాన్ని చాటుకుంది.

అయితే, వాళ్లు ఏ మ్యాచ్‌కు వెళ్లారనేది తెలియదు. తాజాగా ఈ వీడియో వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఫీజుతో బ్లాక్‌లో టికెట్లు కొనడాన్ని కొందరు తప్పుబడుతుండగా.. దీన్ని బట్టి ఐపీఎల్ మ్యాచ్‌లు ధనవంతులకోసమే అని అర్థమవుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కుమార్తెల సంతోషం కోసం ఏదైనా చేయొచ్చని ఇంకొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story