పంజాబ్ చిత్తు.. బోణీ కొట్టిన లక్నో

by Harish |   ( Updated:2024-03-30 20:06:44.0  )
పంజాబ్ చిత్తు.. బోణీ కొట్టిన లక్నో
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి గ్రూపు మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపు ఖాతా తెరిచింది. శనివారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 199/8 స్కోరు చేసింది. ఓపెనర్ డికాక్(54) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అతనికితోడు కృనాల్ పాండ్యా(43 నాటౌట్), పూరన్(42) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ ముందు లక్నో భారీ టార్గెట్ పెట్టింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్(3/28) రాణించాడు. అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 178/5 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ శిఖర్ ధావన్(70) జట్టును గెలిపించేందుకు చెమటోడ్చినా మిగతా వారు నిరాశపర్చడంతో ఓటమి తప్పలేదు. మయాంక్ యాదవ్(2/37), మోహ్సిన్ ఖాన్(2/34) అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను కట్టడి చేశారు.

శుభారంభాన్ని అందిపుచ్చుకోలేక..

200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. 2వ ఓవర్‌లో బెయిర్ స్టో రెండు ఫోర్లు కొడితే.. ఆ తర్వాతి ఓవర్‌లో ధావన్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ దంచాడు. ఈ జోడీ దూకుడుతో పవర్ ప్లేలో పంజాబ్ 61/0తో నిలిచింది. కాసేపటికే ధావన్ 30 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ధాటిగా ఆడటంతో పంజాబ్ విజయం ఖాయమే అనిపించింది. ఈ పరిస్థితుల్లో లక్నో బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ పంజాబ్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. 12వ ఓవర్‌లో అతని బౌలింగ్‌లో బెయిర్‌ స్టో(42) క్యాచ్ అవుటవడంతో తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(19), జితేశ్ శర్మ(6)ను అవుట్ చేయడంతో పంజాబ్ తడబడింది. ఆ తర్వాతి ఓవర్‌ వేసిన మోహ్సిన్ ఖాన్.. వరుస బంతులకు ధావన్(70), సామ్ కర్రన్(0)లను అవుట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా లక్నో చేతుల్లోకి వెళ్లింది. అనంతరం లివింగ్‌స్టోన్(28 నాటౌట్) పోరాటం చేసినా డెత్ ఓవర్లలో లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్‌ను కట్టడి చేశారు.

ఆ ముగ్గురు చితక్కొట్టారు

అంతకుముందు డికాక్, పూరన్, కృనాల్ పాండ్యా మెరుపులతో లక్నో భారీ స్కోరు సాధించింది. అయితే, మొదట ఆ జట్టుకు ఏ మాత్రం శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్(15), పడిక్కల్(9) నిరాశపర్చడంతో పవర్ ప్లేలో లక్నో రెండు కీలక వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ డికాక్ ఇన్నింగ్స్ నిర్మించాడు. స్టోయినిస్(19) కూడా స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. కాసేపు ఒంటరి పోరాటం చేసిన డికాక్ బౌండరీలతో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆ తర్వాత అతనికి పూరన్ తోడయ్యాడు. పూరన్ క్రీజులో ఉన్నంత సేపు ఎడాపెడా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు, అతని సహకారంతో డికాక్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లోనే డికాక్‌(54)‌ను అర్ష్‌దీప్ పెవిలియన్ పంపాడు. కాసేపటికే, పూరన్(42) దూకుడుకు రబాడ చెక్ పెట్టాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా(43 నాటౌట్) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా అతను మాత్రం బౌలర్లను ఉతికారేసి జట్టుకు భారీ స్కోరు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు, అర్ష్‌దీప్ 2 వికెట్లతో సత్తాచాటారు. రబాడ, రాహుల్‌ చాహర్‌లకు చెరో వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

లక్నో సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : 199/8(20 ఓవర్లు)

డికాక్(బి)జితేశ్(బి)అర్ష్‌దీప్ 54, రాహుల్(సి)బెయిర్‌స్టో(బి)అర్ష్‌దీప్ 15, పడిక్కల్(సి)ధావన్(బి)సామ్ కర్రన్ 9, స్టోయినిస్(బి)రాహుల్(బి)చాహర్ 19, పూరన్(బి)రబాడ 42, ఆయుష్ బడోని(సి)బెయిర్‌స్టో(బి)సామ్ కర్రన్ 8, కృనాల్ పాండ్యా 43 నాటౌట్, రవి బిష్ణోయ్(సి)త్యాగరాజన్(బి)సామ్ కర్రన్ 0, మోహ్సిన్ ఖాన్ రనౌట్(హర్షల్ పటేల్) 2, నవీన్ ఉల్ హక్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 35-1, 45-2, 78-3, 125-4, 146-5, 189-6, 189-7, 197-8

బౌలింగ్ : సామ్ కర్రన్(4-0-28-3), అర్ష్‌దీప్ సింగ్(3-0-30-2), రబాడ(4-0-38-1), రాహుల్ చాహర్(3-0-42-1), హర్‌ప్రీత్ బ్రార్(2-0-14-0), హర్షల్ పటేల్(4-0-45-0)

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 178/5(20 ఓవర్లు)

ధావన్(సి)డికాక్(బి)మోహ్సిన్ ఖాన్ 70, బెయిర్‌స్టో(సి)స్టోయినిస్(బి)మయాంక్ యాదవ్ 42, ప్రభ్‌సిమ్రాన్(సి)నవీన్ ఉల్ హక్(బి)మయాంక్ యాదవ్ 19, జితేశ్ శర్మ(సి)నవీన్ ఉల్ హక్(బి)మయాంక్ యాదవ్ 6, లివింగ్‌స్టోన్ 28 నాటౌట్, సామ్ కర్రన్(సి)పూరన్(బి)మోహ్సిన్ ఖాన్ 0, శశాంక్ సింగ్ 9 నాటౌట్

వికెట్ల పతనం : 102-1, 128-2, 139-3, 141-4, 141-5

బౌలింగ్ : సిద్ధార్థ్(2-0-21-0), నవీన్ ఉల్ హక్(4-0-43-0), మోహ్సిన్ ఖాన్(4-0-34-2), కృనాల్ పాండ్యా(3-0-26-0), రవి బిష్ణోయ్(3-0-25-0), మయాంక్ యాదవ్(4-0-27-3)

Advertisement

Next Story