IPL 2023 Qualifier 1: ప్లే ఆఫ్‌లో బిగ్ ఫైట్.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌‌తో గుజరాత్ టైటాన్స్ ఢీ..

by Vinod kumar |   ( Updated:2023-05-22 18:46:02.0  )
IPL 2023 Qualifier 1: ప్లే ఆఫ్‌లో బిగ్ ఫైట్.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌‌తో గుజరాత్ టైటాన్స్ ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజ‌న్‌లో లీగ్ ద‌శ ముగిసింది. హోరా హోరీ పోరాటాలు అభిమానుల‌కు క‌నువిందు చేశాయి. చివ‌రకు 4 జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా ఆరు జ‌ట్లు ఇంటి ముఖం ప‌ట్టాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ముంబై ఇండియ‌న్స్‌‌ల‌లో ఐపీఎల్ టైటిల్‌ను సాధించేది ఎవ‌రో మ‌రో నాలుగు మ్యాచుల్లో తేల‌నుంది. మే 23 మంగ‌ళ‌వారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదిక‌గా మే 23న గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జ‌ట్టుకు మ‌రో అవ‌కాశం ఉంటుంది. టాప్‌-2లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లకు ఫైన‌ల్ చేరుకునేందుకు రెండు అవ‌కాశాలు ఉంటాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌ల‌ను ఆడ‌నున్నాయి.

ఒకవైపు సక్సెఫుల్ కెప్టెన్ ధోనీ.. మరోవైపు అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా. ఇటువైపు నాలుగుసార్లు టైటిల్ గెలిచిన చెన్నయ్‌ సూపర్ కింగ్స్.. అటువైపు డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్. వేటికవే ప్రత్యేకతలు కలిగిన ఈ రెండు జట్లు మధ్య నేడు ఐపీఎల్-16 తొలి క్వాలిఫయర్. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. బలాబలాల పరంగా సమవుజ్జీలుగా కనిపిస్తున్న చెన్నయ్, గుజరాత్ జట్లలో ఫైనల్‌లో అడుగుపెట్టే తొలి జట్టేదో?.. నేడు తేలిపోనుంది. ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరుకునేందుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో క్వాలిఫయర్-2లో ఆడాల్సి విజయం సాధించి తుది పోరుకు చేరుకోవచ్చు.

ఐపీఎల్-16 ముగింపు దశకు చేరుకుంది. లీగ్ రౌండ్ ముగియడంతో ఇక నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. నేడు తొలి క్వాలిఫయర్స్‌లో చెన్నయ్, గుజరాత్ జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. చెన్నయ్‌లోని చెపాక్ స్టేడియం ఈ రసవత్తర పోరుకు వేదిక కానుంది. ఈ సీజన్‌లో ఈ జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. చెన్నయ్, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్‌తోనే ఐపీఎల్-16 మొదలైన విషయం తెలిసిందే. అనంతరం లీగ్ దశలో మరోసారి ఎదురపడలేదు. కానీ, నేరుగా ఫైనల్‌కు చేరుకునేందుకు కీలకమైన క్వాలిఫయర్-1లో ఈ జట్లు పోటీపడబోతున్నాయి. సొంతమైదానం కావడం చెన్నయ్‌కు సానుకూలంశం. లీగ్ దశలో ఇక్కడ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట సీఎస్కే గెలుపొందింది. దాంతో గెలుపుపై ధోనీ సేన నమ్మకంగా ఉంది. మరోవైపు, గత మ్యాచ్‌లో చెన్నయ్‌ను ఓడించి ఉండటం గుజరాత్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదే. మొత్తంగా విజయం కోసం ఇరుజట్లు అన్ని విభాగాల్లోనూ అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే.

గుజరాత్‌ది ఆల్‌రౌండ్ షో..

గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌‌ను చాంపియన్‌గా నిలబెట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లోనూ జట్టును విజయవంతంగా నడిపించాడు. లీగ్ దశలో 14 మ్యాచ్‌లకుగానూ పదింట గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలమైన జట్లలో గుజరాత్ ఒకటి. ఓపెనర్ సాహా నుంచి రషీద్ ఖాన్ వరకు బ్యాటు ఝుళిపించే సత్తా గుజరాత్ సొంతం. శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉండగా.. సాహా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ రాణిస్తున్నారు. అయితే, హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మినహా మాత్రం తమ స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. గతంలో విమర్శలపాలైన విజయ్ శంకర్ సత్తాచాటుతుండటం మిడిలార్డార్‌లో బలంకానుంది. అలాగే, బంతితోనే కాదు అవసరమైతే బ్యాటుతో మెరుపులు మెరిపించే సత్తా రషీద్ ఖాన్‌కు ఉంది. ముంబైపై అతను బ్యాటు ఝుళిపించిన తీరు మర్చిపోలేం. బౌలింగ్‌ విభాగంలో రషీద్ ఖాన్, షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ నిలకడగా రాణిస్తుండటం కూడా గుజరాత్‌కు బలంగా మారనుంది.

బ్యాటింగ్‌‌లో సూపర్.. బౌలింగ్‌లో టెన్షన్..

సీఎస్కే విజయంలో ధోనీ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వికెట్ల వెనకాల వ్యూహాత్మక నిర్ణయాలతో కష్టమైన సమయాల్లోనూ జట్టును విజయతీరాలకు చేరుస్తుంటాడు. కానీ, ఈ సీజన్‌లో ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బ్యాటింగ్ పరంగా సీఎస్కేకు తిరుగులేనప్పటికీ.. బౌలింగ్ పరంగా తడబడింది. ఆరంభంలో దీపక్ చాహర్ నిరాశపర్చడంతోపాటు జట్టు యువ బౌలర్లపై ఆధారపడింది. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌ల్లో అదనపు పరుగులు జట్టుకు నష్టాన్ని చేకూర్చాయి. ఈ సమయంలో యువ బౌలర్లకు ధోనీ మద్దతు నిలుస్తూ అవకాశాలు ఇచ్చాడు. అలాగే, ఒక సమయంలో ‘మీరు మారకపోతే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి ఉంటుంది’ అని హెచ్చరించాడు కూడా. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ జట్టును మంచి పొజిషన్‌లో నిలబెట్టాడు. అయితే, గుజరాత్‌తో పోటీ అంటే అంత సులభమైతే కాదు. బ్యాటింగ్ పరంగా సీఎస్కేకు ఢోకా లేదు. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మంచి శుభారంభాలు అందిస్తుండగా.. రహానే, శివమ్ దూబే మిడిలార్డర్‌లో బలంగా ఉన్నారు. అయితే, రాయుడు, మొయిన్ అలీ ప్రదర్శన ఆందోళన కలిగిస్తున్నది. ఇక, రవీంద్ర జడేజా, ధోనీ ఫినిషర్‌ రోల్‌కే పరిమితమవ్వగా.. ఆఖర్లో వీరిద్దరూ మరోసారి మెరవాల్సిన అవసరం ఉన్నది.

ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్ ఇదే..

క్వాలిఫైయర్ 1:

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా మే 23న గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జ‌ట్టుకు మ‌రో అవ‌కాశం ఉంటుంది.

ఎలిమినేటర్:

మే 24 బుధ‌వారం ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌, ముంబై ఇండియ‌న్స్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు రెండో క్వాలిఫ‌య‌ర్ ఆడ‌నుండ‌గా ఓడిన జ‌ట్టు ఇంటి ముఖం ప‌డుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియ‌మే అతిథ్యం ఇవ్వనుంది.

క్వాలిఫైయర్ 2:

మే 26 శుక్రవారం క్వాలిఫైయ‌ర్ 1లో ఓడిన జ‌ట్టు, ఎలిమినేట‌ర్‌లో గెలిచిన జ‌ట్లు మధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌ గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

పైన‌ల్:

మే 28 ఆదివారం ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. తొలి క్వాలిపైయ‌ర్‌లో గెలిచిన జ‌ట్టు, రెండో క్వాలిఫైయ‌ర్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుకు మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కూడా గుజ‌రాత్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలోనే జ‌రుగుతుంది.

చెన్నై సూప‌ర్ కింగ్స్‌ తుదిజట్టు (అంచనా):

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, అంబటి రాయుడు, తుషార్ దేశ్‌పాండే. మహేశ్ తీక్షణ, మాథేష పతిరన.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా):

శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ.

Advertisement

Next Story