పోలీసుశాఖలో భయం.. భయం..

by Anukaran |
పోలీసుశాఖలో భయం.. భయం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఐపీఎల్ బెట్టింగ్​ నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఖాకీలకు అరెస్టుల భయం పట్టుకుంది. ఓ బెట్టింగ్ నిర్వాహకుడి నుంచి రూ. లక్షలు వసూలు చేయడం ప్రస్తుతం కామారెడ్డి పోలీస్​శాఖను కుదిపేస్తోంది. పోలీసులు చెర వీడడానికి రూ. 1.30 లక్షలు ఇచ్చిన బాధితుడికి పోలీసులు బంపర్​ఆఫర్​ఇచ్చారు. భవిష్యత్​లో ఎలాంటి వేధింపులు ఉండవని, అందుకు ఇంకా రూ.3.70 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు, బెట్టింగ్​ నిర్వాహకుడికి మధ్యవర్తిత్వం నడిపిన సుజయ్​ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఖాకీల వసూళ్ల దందా గుట్టు రట్టయింది. సుజయ్ తో పాటు కామారెడ్డి పట్టణ సీఐ ఇందూర్ జగదీశ్​ను ఈ నెల 20న అదుపులోకి తీసుకుని విచారించారు. సీఐ నివాసంతో పాటు పోలీస్​స్టేషన్ లో తనిఖీలు, రికార్డుల పరిశీలన అనంతరం శనివారం అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా వారికి రిమాండ్ విధించారు.

ఏసీబీ ముమ్మర విచారణ

కామారెడ్డి ఎస్పీ వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండడం ఖాకీలకు కలిసి వచ్చింది. ఇదే అదనుగా క్రికెట్​బెట్టింగ్​నిర్వాహకుల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు మధ్యవర్తి సుజయ్, సీఐ జగదీశ్​వాంగ్మూలం, పోలీస్​రికార్డులు, బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ శనివారం ఉదయం అందుబాటులో లేకపోవడంతో ఇంటిని సీజ్ చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రూ.1.30 లక్షలో పెద్ద మొత్తం డీఎస్పీకే ఇచ్చినట్లు సీఐ తో పాటు మధ్యవర్తి సుజయ్ తెలిపినట్లు సమాచారం. దీంతో శనివారం సాయంత్రం ఏసీబీ ఎదుట డీఎస్పీ హాజరుకాగా, ఆదివారం కూడా విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఎస్సై అజ్ఞాతంలోకి వెళ్లడం, ఏసీబీ విచారణకు ముందు సెలవులో వెళ్లిన మరో ఎస్సై ఫోన్ నెట్ వర్క్ కు అందుబాటులో లేకుండా పోవడం కలకలం రేపుతోంది.

పోలీసుశాఖలో భయం.. భయం..

బెట్టింగ్​వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీ నారాయణ ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. అక్కడ రికార్డులను పరిశీలించడంతోపాటు ఆదాయానికి మించి ఆస్తులు ఏమైనా కూడబెట్టారా అనే కోణంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అదివారం రాత్రి వరకూ విచారణ కొనసాగిందని, ఏసీబీ అధికారులు ఎవరిని అరెస్టు చూపుతారు.? మరెంత మందిని విచారణకు పిలుస్తారోననే అనే భయం పోలీసుల్లో వ్యక్తం అవుతోంది. ఇద్దరు ఎస్సైలు అజ్ఞాతం వీడి విచారణకు హాజరవుతేనే ఈ కేసులో చిక్కు ముడి వీడుతుందని తెలుస్తోంది. ఈ వ్యవహరంలో కొందరు కానిస్టేబుళ్ల ప్రమేయంపై కూడా అవినీతి నిరోధక శాఖ విచారిస్తోంది. అయితే బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన సీఐతో పాటు విచారణ ఎదుర్కొంటున్న డీఎస్పీ, ఎస్సైలు గతంలో నిజామాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నవారేననే ఆరోపణలున్నాయి. కానీ, గతంలో ఎప్పుడూ ఏసీబీకి చిక్కలేదని, వారిపై చర్యలు తీసుకునే సాహసం అప్పటి అధికారులు చేయలేదని తెలుస్తోంది.

సీఐకి రిమాండ్ తో సిబ్బంది సంబురాలు

వసూళ్ల వ్యవహారంలో కామారెడ్డి పట్టణ సీఐ ఇందూర్ జగదీశ్​ను ఏసీబీ అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు రిమాండ్ కు పంపడంతో పోలీస్​స్టేషన్ సిబ్బంది సంబురాలు జరుపుకున్నారు. పలువురు విందు చేసుకున్నారనే వార్త ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపుతోంది. ఎందుకంటే సదరు సీఐ వసూళ్ల వ్యవహారంలో పోలీసు సిబ్బందిని సైతం వీడ లేదని, అందుకే వారు తమకు పట్టిన పీడ విరగడైందని సంబురాలు చేసుకున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మూడు రోజులుగా జరుగుతున్న ఐపీఎల్ బెట్టింగ్ వసూళ్ల దందా విచారణ నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story