తిప్పినా వచ్చేదేమీ లేదని.. వద్దనుకున్నారు !

by  |
తిప్పినా వచ్చేదేమీ లేదని.. వద్దనుకున్నారు !
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా దెబ్బకు ఆగిపోయిన తెలంగాణ ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాలన్నింటిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఇప్పట్లో ప్రారంభించకపోవడమే మేలని టీఎస్ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి మార్చి చివరి వారం నుంచి రాష్ట్రంలో అమలు చేసిన పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు సడలింపుల్లో భాగంగా మే నెలలో ప్రారంభించిన జిల్లాల మధ్య బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. ఈ బస్సుల్లోనే 40 శాతం మించి ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) నమోదవకపోతుండడంతో సంస్థకు రోజుకు కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించి వాటిని ఖాళీగా తిప్పి మరింత నష్టాలను మూటగట్టుకోవడమెందుకని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రకు, ఇటు కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎక్కువగా అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తుంటాయి. బెంగళూరుకు వెళ్లే బస్సులు వారాంతాల్లోనే ఎక్కువ ఓఆర్‌తో తిరుగుతుంటాయి. బెంగళూరులో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఈ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం దీనికి కారణంగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండడంతో బెంగళూరుకు బస్సులు ప్రారంభిస్తే డీజిల్ డబ్బులు కూడా గిట్టుబాటుకావని వారు లెక్కలు కడుతున్నారు. ఇక పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు తిప్పినా ప్రజలెవరూ ప్రయాణానికి మొగ్గు చూపరని అధికారులు భావిస్తున్నారు. అనవసరంగా సంస్థకు నష్టాలు పెంచుకోవడంతో పాటు ఇప్పటికే కరోనా బారిన పడుతున్న డ్రైవర్లు, కండక్టర్లను మరింత ప్రమాదంలో పడేసిన వాళ్లమవుతామని అధికారులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త ఒప్పందం పూర్తైతే దసరా నుంచి..

కరోనా పేరుతో అంతర్రాష్ట్ర సర్వీసులకు ఎలాగూ విరామం లభించడంతో రాష్ట్రానికి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో ముఖ్య రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రారంభించిన ప్రయత్నాలను టీఎస్ఆర్టీసీ అధికారులు కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా దొరికిన ఈ విరామంలోనే కొత్త ఒప్పందం పూర్తైతే దసరా నుంచి ఏపీ, తెలంగాణలు రెండు తమ రోడ్డు రవాణా సంస్థలకు చెందిన బస్సులను ఇతర రాష్ట్రాల్లో సమాన దూరం తిప్పుకునే వెసులుబాటు దొరకనుంది. కొత్త ఒప్పందంపై గతంలో విజయవాడలో సమావేశమై చర్చించిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు రెండో విడత హైదరాబాద్‌లో జరగాల్సిన సమావేశం ఇరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి చర్చలు ప్రారంభం కాలేదు. కరోనాకు ముందు రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు మొత్తం 4 లక్షల కిలోమీటర్ల దూరం తిరిగేవి. అయితే ఈ మొత్తం దూరంలో ఏపీ 2.5 లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పగా, తెలంగాణ లక్షా 50 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగేవి. ఇక ముందు ఇలా కాకుండా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు చెరో రెండు లక్షల కిలోమీటర్ల దూరం పక్క రాష్ట్రంలో బస్సులు తిప్పేలా ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు తెలంగాణ అధికారులు తేల్చి చెప్పడంతో దీనిపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏపీకి వచ్చి పడింది. ఈ చర్చలు మళ్లీ ప్రారంభమై కొలిక్కి రావాలంటే ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిందేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్రాష్ట్ర సర్వీసులతో రూ.2 కోట్ల ఆదాయం..!

కరోనా ప్రవేశించే ముందు దాకా తెలంగాణ ఆర్టీసీకి అంతర్రాష్ట్ర సర్వీసుల ద్వారా రోజుకు రూ.1.8 కోట్ల ఆదాయం వచ్చేది. దీనిలో కేవలం పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లోని గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల ద్వారానే కోటి రూపాయల దాకా వచ్చేది. కొత్తగా కుదుర్చుకోబోయే ఒప్పందం ప్రకారం తెలంగాణ ఆర్టీసీ బస్సులు మరో 50 వేల కిలో మీటర్లు గనుక ఏపీలో తిరిగితే రూ.25 లక్షల దాకా ఆదాయం అదనంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తెంగాణ ఆర్టీసీకి రాబోయే రోజుల్లో అంతర్రాష్ట్ర సర్వీసుల ద్వారా రూ.2 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ఆర్టీసీలు రెండు రాష్ట్రాల్లో సమాన దూరం బస్సులు తిప్పినట్లయితే ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి బోర్డర్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదని, ఏ రాష్ట్ర రవాణా శాఖకు ఆ రాష్ట్ర ఆర్టీసీ పన్ను చెల్లించుకుంటే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పే విషయంలో ఎలాంటి వివాదం ఉండబోదని వారు విశ్లేషిస్తున్నారు.


Next Story

Most Viewed