భైంసాలో ఇంటర్నెట్‌ బ్రేక్..

by Aamani |
భైంసాలో ఇంటర్నెట్‌ బ్రేక్..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా భైంసాలో ఇరువర్గాల ఘర్షణ నేపధ్యంలో ఇంటర్నెట్ సేవలకు బ్రేక్ పడింది. ఈ నెల 7వ తేదీ రాత్రి భైంసాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రెండు, మూడు రోజుల నుంచి పట్టణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ అల్లర్ల ప్రభావం పల్లెటూర్లను తాకింది. పార్డీ(బి), మహాగాం గ్రామాల్లో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. మిగతా గ్రామాల్లోనూ ఈ అల్లర్ల ప్రభావంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి అన్ని మొబైల్ కంపెనీలు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశాయి.

వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి సేవలు నిలిపివేయగా, శనివారం ఉదయం పునరుద్దరించారు. ఐనా ఇంటర్నెట్ సర్వీసుల వేగం చాలా తక్కువగా ఉంది. నిర్మల్ జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో సేవలను నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. భైంసా అల్లర్లు, మీర్జాపూర్ లైంగికదాడి ఘటనలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లాలో సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న అంశంపై స్పష్టత లేదు. అత్యవసర సేవలు అవసరమైనవారు పక్కనే ఉన్న మహారాష్ట్ర, నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు.

Advertisement

Next Story