బిగ్ బాస్-4లో ఆసక్తికర ఘటన.. ఫిదా అయిన నాగార్జున

by Anukaran |   ( Updated:2020-12-21 01:18:54.0  )
బిగ్ బాస్-4లో ఆసక్తికర ఘటన.. ఫిదా అయిన నాగార్జున
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్-4 గ్రాండ్ ఫినాలేలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహానికి, దాతృత్వానికి ముడిపడి ఉన్న ఈ సంఘటనకు బిగ్ బాస్ హోస్ట్, సినీ హీరో అక్కినేని నాగార్జున ఫిదా అయ్యారు. కార్యక్రమం చూస్తున్న వీక్షకులు సైతం ఆనందంతో పొంగిపోయారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫైనల్ ఎపిసోడ్‌లో హారిక, అరియానా ఎలిమినేట్ అయ్యారు. ఇక సోహెల్, అఖిల్, అభిజిత్ ముగ్గురు హౌస్‌లో ఉండగా వారికి నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చారు. ముగ్గురిలో ఎవరైనా రూ.25 లక్షల అమౌంట్ తీసుకొని బయటకు వెళ్లొచ్చని ప్రకటించారు. అయితే పది లక్షల నుంచి మొదలైన ఈ బిడ్డింగ్ పాతిక లక్షలకు చేరడంతో సోహెల్ వెంటనే దానికి ఒప్పుకున్నాడు.

అయితే సోహెల్ సోదరుడు మాత్రం రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథాశ్రమానికి ఇచ్చేటట్టు అయితేనే తీసుకోవాలని షరతు విధించాడు. కానీ సోహెల్ మాత్రం.. రూ.5 లక్షలు అనాథాశ్రానికి మరో రూ.5 లక్షలు తన మిత్రుడు మెహబూబ్‌కు ఇవ్వాలనుకుంటున్నానని ప్రకటించాడు. ఎందుకంటే ఆయన ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడని, ఈ డబ్బు అతడికి ఉపయోగపడుతుందని తెలిపారు. వెంటనే అందుకున్న మెహబూబ్ తనకు ఈ డబ్బు అక్కరలేదని, తనకు ఇవ్వాలనుకుంటున్న ఐదు లక్షలను కూడా ఆశ్రమానికి ఇస్తానని పేర్కొన్నాడు. తనకు బయటకు వచ్చాక డబ్బు సంపాదించగలను అనే నమ్మకం కలిగింది అని పేర్కొన్నాడు. దీంతో తాము ఇద్దరం కలిసి పది లక్షల రూపాయల క్యాష్ ఒక అనాధాశ్రమంకు ఇస్తామని సోహెల్ పేర్కొన్నారు.

‘వీరిద్దరి సంభాషణ విన్న నాగార్జున మీ ఇద్దరు డబ్బులు ఇవ్వక్కరలేదు, మీరు ఆ డబ్బు ఇంటికి తీసుకెళ్లండి. మీ ఇద్దరి తరపున పది లక్షలు నేను ఇస్తానని’ ముందుకు వచ్చాడు. ఈ మాట చెప్పగానే సోహెల్ వెంటనే వెళ్ళి నాగార్జునను హగ్ చేసుకోగా, మెహబూబ్ మాత్రం ఏకంగా నాగార్జున కాళ్ళ మీద పడటం అక్కడ అందరినీ ఆకట్టుకుంది. కాగా నాగార్జున గంగవ్వకు కూడా ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెహబూబ్‌కు కూడా ఇల్లు కట్టించేందుకు సాయం చేస్తాననడంతో నాగార్జున దాతృత్వానికి బిగ్ బాస్-4 వీక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement

Next Story