అంతర్‎జిల్లా దొంగల ముఠా అరెస్ట్

by Sumithra |   ( Updated:2020-10-20 04:26:25.0  )
అంతర్‎జిల్లా దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్ :
అంతర్‎జిల్లా దొంగల ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ ఎస్.మోహన్ కుమార్, తుంగతుర్తి సీఐ జి.రవి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్ననేమీల క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బైకుపై వెళ్తున్న ఇద్దరు అనుమానితులను విచారించగా.. వారు గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

నిందితులు నెల్లికుదురు మండలం మునగాల ఏడు గ్రామానికి చెందిన దాసరి సర్పయ్య, మదగాని సుమన్‎లు.. మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడేవారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన దాసరి మురళీ, మహబూబాబాద్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కూతటి సంపత్‎లు కలిసి పలు గ్రామాల్లో మోటార్ సైకిళ్లు, మహిళల మెడలో ఉన్న బంగారు నగలు, ఇతర ఆభరణాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి ఒక ఆటో, 5 బైకులు, 2 బంగారు పుస్తెల తాళ్లు, వెండి అభరణాలు రూ.6.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి తుంగతుర్తి కోర్టులో హాజరుపరచగా.. మరో నేరస్తుడు మురళీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులను చేధించిన నూతనకల్ ఎస్ఐ ఎం.శివకుమార్, సిబ్బంది హమీద్, వీరబాబు, బలరామ్, సతీష్ లను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story