ఆర్టిస్టుల ‘ఇంక్టోబర్’ చాలెంజ్

by Shyam |
ఆర్టిస్టుల ‘ఇంక్టోబర్’ చాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : మనసులోని భావాలను కొందరు మాటలతో, మరికొందరు పాటలతో చెబితే.. ఇంకొదరు రాతలతో చెప్తారు. వీళ్లందరూ చెప్పే విధానం ఎదుటి వారికి నేరుగా అర్థమవుతుంది. కానీ గీతలతో చెప్పే వారి భావాలు ఎదుటి వారికి అర్థం కావాలంటే.. ముందు ఆ గీసిన వారి పరిస్థితిని గుర్తెరిగి, వారి కోణంలో ఆలోచించే సామర్థ్యం కావాలి. అలాగే ఒక్కో అంశాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. గీసే వారు కూడా అంతే. ఒకే అంశాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కోలా గీస్తాడు. ఎవరి శైలి వారికి ఉంటుంది. కానీ భావప్రకటన మాత్రం అద్భుతంగా ఉంటుంది. వారి గీతల్లోనే వారి భావాలు కనిపించీ కనిపించకుండా కనిపిస్తాయి. ఇలా గీతల ద్వారా భావప్రకటన చేయాలంటే వారికి ఒక కారణం కావాలి. అలాంటి కారణమే ఇంక్టోబర్ చాలెంజ్ ద్వారా ఆర్టిస్టులకు లభిస్తోంది.

నవంబర్‌లో ‘నో షేవ్ నవంబర్’ అని గడ్డాలు, మీసాలు పెంచుకునే చాలెంజ్ గురించి తెలిసే ఉంటుంది. అలాగే ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా ఈ ఇంక్టోబర్ చాలెంజ్ జరుగుతుంది. 2009లో జేక్ పార్కర్ అనే ఆర్టిస్ట్ ఈ చాలెంజ్‌ను ప్రారంభించాడు. ఈ చాలెంజ్ ఎంతగా పాపులర్ అయిందంటే.. అక్టోబర్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసే ఆర్టిస్ట్‌లు ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఇంతకీ ఈ చాలెంజ్‌లో ఏం చేస్తారంటే.. అక్టోబర్ నెల ప్రారంభంలో ఇంక్టోబర్ వెబ్‌సైట్‌లో రోజుకొక ప్రాంప్ట్ చొప్పున 31 ప్రాంప్ట్‌ల జాబితాను విడుదల చేస్తారు. ఆరోజున ఆ ప్రాంప్ట్‌కు సంబంధించి ఏదైనా డ్రాయింగ్ వేసి సోషల్ మీడియాలో ఇంక్టోబర్ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి. ఆయా ప్రాంప్ట్‌కు సంబంధించి ఉత్తమంగా అనిపించిన పది నుంచి ఇరవై డ్రాయింగ్‌లను ఇంక్టోబర్ తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేస్తుంది. దీని వల్ల ఆర్టిస్టులకు ఏం లాభం?

ఏ ఆర్టిస్టుకైనా, ముఖ్యంగా డ్రాయింగ్ వేసేవారికి కావాల్సింది గుర్తింపు. ముందు గుర్తింపు లభిస్తే ఆటోమేటిక్‌గా అవకాశాలు వస్తాయి. ఈ ఇంక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఆర్టిస్ట్‌లు పాల్గొంటారు కాబట్టి ఎవరి సృజనాత్మక ఏంటనేది తెలుస్తుంది. అంతేకాకుండా వారి గురించి, వారి క్రియేటివిటీ గురించి ప్రపంచానికి తెలుస్తుంది. అంతేకాకుండా ఆర్టిస్ట్‌లకు కూడా వారి ఆలోచనా దృక్పథాన్ని మార్చుకునే అలవాటు పెరిగి, వినూత్నంగా డ్రాయింగ్ వేసే అవకాశం లభిస్తుంది. ఒక పదాన్ని అర్థం చేసుకుని, దాన్ని సమకాలీన సంఘటనలకు అన్వయిస్తూ ఆకట్టుకునే డ్రాయింగ్ వేయడం నిజంగా ఒక కొత్త దృక్పథాన్ని అందిస్తోందని, ఈ కరోనా కష్టసమయాల్లో డ్రాయింగ్ తనకు మానసికంగా ఎంతో బలాన్ని ఇచ్చిందని, ఇక ఇంక్టోబర్ వల్ల తన క్రియేటివిటీ ఎంతో మెరుగుపడిందని ప్రస్తుతం ఇంక్టోబర్‌లో పార్టిసిపేట్ చేస్తున్న సూర్యాపేటకు చెందిన ఆర్టిస్ట్ సాయిదీపక్ అభిప్రాయపడ్డారు. అతని ఇంక్టోబర్ డ్రాయింగ్‌ల్లో తెలుగు యువత రిలేట్ చేసుకోగల అంశాలు ఉండటం విశేషం. సాయిదీపక్ డ్రాయింగ్‌లు చూడటానికి ఇన్‌స్టాగ్రామ్‌లో దీపక్ వాసా అనే ప్రొఫైల్‌ను, ఇంక్టోబర్ పోస్ట్ చేసిన బెస్ట్ డ్రాయింగ్‌లను చూడటానికి ఇంక్టోబర్ సోషల్ మీడియా హ్యాండిల్‌ను చూడవచ్చు.

Advertisement

Next Story

Most Viewed