టిక్‌టాక్ యాప్‌ వ్యాపార వ్యూహమే ముఖ్యం

by Anukaran |
టిక్‌టాక్ యాప్‌ వ్యాపార వ్యూహమే ముఖ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో టిక్‌టాక్ లాంటి యాప్‌లను తయారు చేయడం చాలా సులభమైన ప్రక్రియ అని టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్రం నిషేధం విధించిన టిక్‌టాక్ యాప్ తరహా వాటిని మనదేశంలోనూ తయారు చేయాలనే ప్రచారంపై ఆయన స్పందించారు. భారత్‌లో టిక్‌టాక్ లాంటి వాటిని తయారు చేయగలమని, అయితే వాటి నుంచి లాభదాయకంగా ఆదాయాన్ని సాధించడమే ముఖ్యమని, ఈ విషయంలో సవాళ్లు ఎదురవుతుందని నందన్ పేర్కొన్నారు. ‘దేశీయంగా ఎదురయ్యే సవాళ్లు సంక్లిష్టంగా ఉన్నాయని, దీనికంటే ముందు ఇలాంటి యాప్‌ల వెనక ఉన్న బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవడం అవసరమని’ నందన్ నీలేకని తెలిపారు.

సోషల్ మీడియా ఆధారంగా ఉన్న గూగుల్, ఫేస్‌బుక్ లాగే టిక్‌టాక్‌కు కూడా ఆదాయం సమకూరేది ప్రకటనల ద్వారానే. గతేడాది టిక్‌టాక్ మాతృ సంస్థ 17 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని దక్కించుకుంది. ఇందులో 3 బిలియన్ల లాభం ఉంది. ఈ మొత్తం ఆదాయంలో అధికంగా అమెరికా, చైనా దేశాల నుంచే వచ్చింది. తెలుసుకోవాల్సిన విషయమేంటంటే, ఇండియాలో డిజిటల్ యాడ్ మార్కెట్ మిగిలిన దేశాల స్థాయిలో లేకపోవడం. ఇండియాలో ప్రింట్, టీవీ, డిజిటల్ విభాగాల ద్వారా వచ్చే ప్రకటనల విలువ సుమారు 12 బిలియన్ డాలర్లు ఉండొచ్చు. వీటిలో డిజిటల్ యాడ్‌ల వాటా 3 బిలియన్ డాలర్లు. ఈ గణాంకాలను బట్టి డిజిటల్ విభాగంలో దేశీయంగా ఎక్కువ ఆదాయం లేదని స్పష్టమవుతోంది. టిక్‌టాక్ లాంటి యాప్‌ల ప్రధాన దృష్టి వినియోగదారులను పెంచుకోవడమే. అందుకే ఇక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని, అలా వినియోగదారులను పెంచుకుని లాభాలను సంపాదించుకోవడమే ఆయా సంస్థల వ్యూహమని’ నందన్ నీలేకని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed