తెలుగు తెర రారాజు.. తారక రామారావు..

by Shyam |   ( Updated:2020-05-20 03:48:56.0  )
తెలుగు తెర రారాజు.. తారక రామారావు..
X

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్).. తెలుగునాట చరిత్ర సృష్టించిన మహానుభావుడి పేరు. ఆ చరిత్రను తిరగరాయాలంటే, అదే పేరు పెట్టుకున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌కే సాధ్యమనేది అభిమానుల మాట. తాత లక్షణాలు పుణికిపుచ్చుకున్న తారక్.. బాలనటుడిగా ఆరంగేట్రం చేసింది మొదలు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వరకు సినిమానే శ్వాసగా బతుకుతూ.. ఎన్ని ఒడిదుడుకులెదురైనా కళామతల్లి ఒడిని వీడలేదు. అపజయాలనే విజయానికి బాటలుగా మలచుకుంటూ.. సినిమాకి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ పడిలేచిన కెరటంలా.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. తను చేసే పనిమీద వంద శాతం గౌరవం ఉంచే తారక్.. ఒక నటుడిగా, మానవత్వమున్న మనిషిగా ఇండస్ట్రీలో అందరివాడయ్యాడంటే అతిశయోక్తి కాదు. ఈ తరం హీరోల్లో నటనలోనే కాదు నడవడికలోనూ తారక్ మించినవారు లేరనేది ఇండస్ట్రీ పెద్దలు, తోటి నటులు ఇచ్చే కాంప్లిమెంట్. ఈ రోజు(బుధవారం) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారంతా ఆయనను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నారు. తాతకు మించిన మనవడిగా కీర్తి గడించాలని ఆకాంక్షిస్తున్నారు.

పిల్లలు పుట్టడం వేరు, వంశోద్ధారకులు పుట్టడం వేరు. జీవించడం వేరు, చరిత్ర సృష్టించడం వేరు. అలాంటి లక్షణాలతో తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా జన్మించిన చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. కీర్తి ప్రతిష్టలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లు ‘తారకరామ’ అని ఆశీర్వదించారు.

అద్భుతమైన అభినయంతో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్న తెలుగుతెర రారాజు.. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో కొమరం భీమ్‌గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమ్రోగాలని ఆశిస్తున్నానని కోరుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఈ ట్వీట్‌పై స్పందించిన డైరెక్టర్ కొరటాల శివ.. ‘మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే మా అన్న ఇండస్ట్రీని దున్నేస్తాడు’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జక్కన్న తొలి హీరో ఎన్టీఆర్ కాగా.. ప్రారంభం నుంచి తన సినీ ప్రయాణంలో తారక్ భాగం అయినందుకు గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్ కోసం నీకు మించిన భీమ్‌ను కనుగొనలేను.. ఆ పాత్రలో మరొకరిని ఊహించలేను’ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

నీలాంటి “హీరో ” ప్రతి ఇండస్ట్రీలోనూ.. నీలాంటి “కొడుకు” ప్రతి కుటుంబంలోనూ.. నీలాంటి “స్నేహితుడు ” ప్రతిఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కోనా వెంకట్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. సిల్వర్ స్క్రీన్‌పై నీ నటనతో మమ్మల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉండాలని కోరుకున్నారు.

కొమురం భీమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు. డియర్ తారక్.. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం బాకీ ఉన్నా. ఒట్టేసి చెప్తున్నా.. నేను నీకిచ్చే బహుమతి చాలా గొప్పగా ఉండబోతోంది. మనకోసం మరిన్ని సెలబ్రేషన్స్ వెయిట్ చేస్తున్నాయి అంటూ తారక్‌కు విష్ చేశాడు రామ్ చరణ్ తేజ్.

దర్శకుడు బాబీ జై లవకుశ సినిమా స్టైల్ లో ఎన్టీఆర్‌కు బర్త్ డే విష్ చేశారు. ‘విశ్వ విశ్వ నాయక.. నవరసాల పోషక.. కదనరంగ కర్షక.. గ్రామ నగర పట్టణాల సకల జనాకర్షక’ అంటూ మా రావణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపారు. కాగా ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించిన తారక్.. నటనలో చూపించిన వైవిధ్యం ప్రేక్షకులను అబ్బురపరిచింది. ముఖ్యంగా రావణ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఖుదొస్ చెప్పాల్సిందే.

స్మార్ట్ హీరో రామ్ పోతినేని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు విష్ చేశారు. ‘జీవితంలో ప్రతికూల శక్తి వెంటాడినా.. మిమ్మల్ని కూల్చేందుకు ప్రయత్నించినా.. మీరు మాత్రం ఒక బండలాగా నిలబడి.. మిమ్మల్ని చూస్తున్న ప్రజల్ని కదిలించండి’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రా..పో. భవిష్యత్తులో మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలి బ్రదర్ అని కోరుకున్నాడు.

మాటల్లో చెప్పలేని ప్రేమను ఒక ఆర్ట్‌లో చెప్పొచ్చు అంటారు.. అందుకే ఈ ఆర్ట్ రూపంలో తన ప్రేమను తెలుపుతూ.. తారక్‌కు విష్ చేస్తున్నాను అని తెలిపారు హీరో నారా రోహిత్. స్వయంగా తానే వేసిన ఈ డ్రాయింగ్ తారక్ అండ్ ఫ్యాన్స్‌కు నేనిచ్చే చిన్న బహుమతి అని తెలిపారు. మరిన్ని గొప్ప విజయాలతో తారక్ దూసుకుపోవాలని కోరుకున్నాడు.

Advertisement

Next Story