రైస్‌కుక్కర్‌‌తో పెళ్లి.. నాలుగు రోజుల్లోనే విడాకులు!

by Shyam |   ( Updated:2021-10-03 05:20:13.0  )
రైస్‌కుక్కర్‌‌తో పెళ్లి.. నాలుగు రోజుల్లోనే విడాకులు!
X

దిశ, ఫీచర్స్ : కాలాలు మారుతున్నా.. తరాలు మారినా ‘పెళ్లి’ అర్థం మారదు కానీ పెళ్లి చేసుకోవడంలో విధానాలు మారిపోతుంటాయి. అలానే పెళ్లి చేసుకునే యువతీయువకుల ఆలోచనల్లోనూ మార్పులొస్తుంటాయి. జీవితాంతం కలిసి ఉండే తమ సహచరులను ఎంచుకునే విషయంలో పెళ్లి చేసుకునే వారికి సంపూర్ణ హక్కు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కటవుతున్న లెస్బియన్స్, గేస్ జంటలెన్నింటినో చూసుంటారు. అలానే విచిత్రంగా జంతువులను మనువాడిన వ్యక్తులను, తమను తామే పెళ్లి చేసుకున్న గ్రేట్ పర్సన్స్ కూడా ఉండగా, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి తనకు ఇష్టమైన కిచెన్ అప్లియెన్సెస్ ‘రైస్ కుక్కర్’‌ను వివాహం చేసుకోవడం ఆశ్చర్యకరం.

పెళ్లి విషయంలో వధూవరులిద్దరికీ అనేక కోరికలు, ఇష్టాలుండటం సహజం. అలానే ఇండోనేషియా మ్యాన్ ఖోరుల్ అనం తనకు ఎంతో ప్రీతికరమైన ‘రైస్ కుక్కర్‌’ను పెళ్లి చేసుకోవడానికి కూడా ముచ్చటగా మూడు కారణాలున్నాయని చెబుతున్నాడు.
1. రైస్ కుక్కర్ తన కోసం రైస్ ఉడికించగలదు.
2. అది వండిన రైస్ ఎంతో తెల్లగా ఉంటుంది.
3. అది తనతో ఎదురుమాట్లాడదు.

ఆనం తెల్ల షేర్వాణి వేసుకోగా, వివాహ వేడుక కోసం రైస్ కుక్కర్ పైన ఒక వీల్ వేసి అందంగా ముస్తాబు చేశాడు. చట్టం ప్రకారం ఇద్దరు సాక్షుల సమక్షంలో ఈ పెళ్లి చేసుకోవడం విశేషం. పెళ్లి చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్‌కు చిరు ముద్దివ్వడం కొసమెరుపు. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అతడు ‘రైస్ కుక్కర్‌ను వివాహం చేసుకున్నాను ఎందుకంటే అది తెలుపు, ప్రేమ, విధేయత కలిగి ఉంది. నువ్వు లేకుండా నా అన్నం ఉండదు’ అంటూ పోస్ట్ చేశాడు. ఇదంతా బాగానే ఉన్నా.. వివాహమైన నాలుగు రోజుల తర్వాత విడిపోతున్నట్లు తెలిపాడు. ‘పెళ్లి’ చేసుకోవడానికి ఏ కారణమైతే చెప్పాడో విడిపోయేందుకు అది రీజన్ చెబుతున్నాడు. అది కేవలం అన్నం మాత్రమే ఉడికించేందుకు తప్ప ఇంకేం చేయదంటూ డైవర్స్ ఇచ్చేశాడు.

పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులివ్వడం ఇదంతా సోషల్ మీడియా స్టంట్ తప్ప మరేమీ కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మిస్టర్ ఆనం ఇండోనేషియాలో పాపులర్ సోషల్ మీడియా పర్సన్ అని, తన ఫాలోవర్స్ కోసం ఇలాంటి విపరీత విన్యాసాలు చేస్తుంటాడని స్థానిక వార్త వెబ్‌సైట్లు నివేదిస్తున్నాయి. రైస్ కుక్కర్‌ను పెళ్లాడటం, సోషల్ మీడియా ఫేమ్ కోసం అతను చేసిన ప్రయత్నమే అని వ్యాఖ్యనించాయి.

Advertisement

Next Story