టైమ్స్ కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘గీతాంజలి’

by Shyam |   ( Updated:2020-12-04 03:04:03.0  )
టైమ్స్ కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘గీతాంజలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు తీసుకు వచ్చేవారితోపాటు, సమాజ క్షేమం కోరే వారికే ప్రపంచ పటంలో సముచిత స్థానముంటుంది. కొత్త జనరేషన్స్ ఎప్పటికప్పడు ఆ మార్పులను స్వాగతించడంతోపాటు, ప్రపంచాన్ని తీర్చిదిద్దడంతో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కొందరు చిన్నారుల ఇప్పటికే ఎంతో సాధించి, ఆ మాటలను నిజం చేశారు. ఈ చిన్నారులు కూడా ఆ కోవకు చెందినవారే. ఆ పిల్లలు సాధించిన లక్ష్యాల ప్రభావం అన్ని తరాలపై తప్పక ఉంటుంది’ అని టైమ్ మ్యాగజైన్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే, భారత సంతతి బాలిక గీతాంజలి రావు టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

15 ఏళ్ల ఇండియన్‌ అమెరికన్‌ గీతాంజలి రావు ఇప్పటికే తన సైన్స్ ప్రయోగాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. తాజాగా ఆ చిన్నారిని ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ‘కిడ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా గుర్తించింది. మన చుట్టూ ఉన్న ఎన్నో సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం చూపుతుండగా, గీతాంజలి కూడా సాంకేతికత సాయంతో తాగునీటి కాలుష్యం, డ్రగ్స్‌ వాడకం, సైబర్‌ వేధింపులకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది. ఆ చిన్నారి చేస్తున్న కృషిని గుర్తించిన టైమ్స్ మ్యాగజైన్ గుర్తించింది. కిడ్ ఆఫ్ ది ఇయర్ కోసం 5 వేల నామినేషన్లు వచ్చినట్లు టైమ్ మ్యాగజైన్ తెలిపింది. ఆమెను ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి ఆంజెలినా జోలి వర్చువల్‌ విధానంలో టైమ్‌ మ్యాగజైన్‌ కోసం ఇంటర్వ్యూ చేసింది.

‘ఆబ్జర్వ్ చేయడం, మెదడుకు పనిచెప్పడం, రీసెర్చ్ చేయడం, ఆ తర్వాత నా ఆలోచనను ఆచరణలో పెట్టి ప్రజల్లోకి ఆ ఆవిష్కరణ తీసుకురావడమే నేను అనుసరించే పద్ధతి. కనిపించిన ప్రతీ సమస్యను పరిష్కరించాలనుకోవద్దు. ఏ సమస్యైతే మనల్ని బాగా కదిలిస్తుందో దానిపై ఫోకస్ చేయాలి. నేను చేయగలుగుతున్నానంటే మీరు కూడా తప్పక చేయగలరు. ఈ తరం గతంలో ఎన్నడూ చూడని కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో పాత సమస్యలు కూడా మనల్ని వెంటాడుతున్నాయి. ఎన్నో సమస్యలను మనం సృష్టించలేదు. కానీ, మనం వాటిని పరిష్కరించాల్సిన అవసరముంది. సాంకేతిక సాయంతో క్లైమేట్ చేంజ్, సైబర్ బల్లీయింగ్‌లను సాల్వ్ చేయాలి. ప్రపంచ సమస్యలను నేను రూపొందించే పరికరాలతో పరిష్కారం చూపాలనుకుంటున్నాను. గ్లోబల్ పాండమిక్ మధ్యలో ఉన్న మనం, ఇప్పటికీ హ్యుమన్ రైట్స్ విషయంలోనూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఎవరో ఒకరు వాటికి సరైన పరిష్కారం చూపించాలి ’ అని ఏంజెలినా జోలీకి గీతాంజలి వివరించింది.

Advertisement

Next Story