ఏప్రిల్‌లో 9 శాతం పడిపోయిన ఇంధన వినియోగం!

by Shyam |   ( Updated:2021-05-12 09:30:46.0  )
ఏప్రిల్‌లో 9 శాతం పడిపోయిన ఇంధన వినియోగం!
X

దిశ, వెబ్‌డెస్క్: మునుపటి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో దేశీయంగా ఇంధన డిమాండ్ 9.4 శాతం క్షీణించినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో సెకెండ్ వేవ్, లాక్‌డౌన్ ఆంక్షలు విధించిన కారణంగా ఇంధన వినియోగం తగ్గిందని పెట్రోలియం శాఖ బుధవారం తెలిపింది. మార్చిలో ఇంధన వినియోగం 1.87 కోట్ల టన్నుల నుంచి ఏప్రిల్‌లో 9.38 శాతం తగ్గి 1.70 కోట్ల టన్నులకు చేరుకున్నట్టు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో 2006 నాటి కనిష్టానికి ఇంధన అమ్మకాలు పడిపోయిన సంగతి తెలిసిందే.

గతేడాది ప్రాతిపదినక పోలిస్తే ఇంధన డిమాండ్ ఈ ఏడు 81.5 శాతం పెరిగిందని పీపీఏసీ వివరించింది. సమీక్షించిన నెలలో పెట్రోల్ అమ్మకాలు 23.8 లక్షల టన్నులుగా నమోదవగా, గతేడాది ఆగష్టు తర్వాత అత్యంత తక్కువ కావడం గమనార్హం. మార్చితో పోలిస్తే 13 శాతం మేర క్షీణించాయి. గతేడాది ఏప్రిల్‌లో పెట్రోల్ అమ్మకాలు కేవలం 9.7 లక్షలు మాత్రమే నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు మార్చితో పోలిస్తే 9 శాతం తగ్గి 66.7 లక్షల టన్నులకు తగ్గినట్టు గణాంకాలు తెలిపాయి. విమానాల్లో వాడే జెట్ ఇంధనం(ఏటీఎఫ్) వినియోగం మార్చితో పోలిస్తే 14 శాతం తగ్గి 4 లక్షల టన్నులకు పడిపోయాయి. వంటింట్లో వాడే ఎల్‌పీజీ గ్యాస్ కూడా 11.6 శాతం క్షీణించి 21 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.

Advertisement

Next Story