కరోనాకు ముందు స్థాయికి డీజిల్..!

by Anukaran |   ( Updated:2020-11-13 08:04:14.0  )
కరోనాకు ముందు స్థాయికి డీజిల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ ముగియక ముందే దేశీయంగా డీజిల్ డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా వార్షిక వృద్ధిని సాధించింది. దీంతో డీజిల్ వినియోగం కరోనా ముందునాటి స్థాయికి చేరుకుందని చమురు మంత్రిత్వ శాఖ ప్రచురించిన తాత్కాలిక గణాంకాలు వెల్లడించాయి. ఈ వివరాల ప్రకారం..పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ మొత్తం 2.5 శాతం పెరిగి 1.7 కోట్ల టన్నులకు చేరుకుంది. పెట్రోల్ సెప్టెంబర్‌లో కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకోగా, డీజిల్ వినియోగం ఆ సమయంలో సాధారణ స్థాయికి చేరుకుంది.

డీజిల్ వార్షిక ప్రాతిపదికన 7.4 శాతం పెరిగి 65 లక్షల టన్నులకు చేరుకోగా, పెట్రోల్ అమ్మకాలు 4.5 శాతం పెరిగి 25.45 లక్షల టన్నుకులకు చేరుకున్నాయి. డీజిల్ వినియోగం ఈ ఏడాదిలోనే అత్యధికంగా నమోదవడం గమనార్హం. కొవిడ్-19 సంబంధిత సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ 49 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం నెమ్మదిగా సడలింపులతో ఇంధన డిమాండ్ పుంజుకుంటోంది.

దీనికితోడు పండుగ సీజన్ ఇంధన వినియోగం పెరగడానికి దోహదపడింది. అయితే, దేశంలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్లు, విద్యాసంస్థలు మూసి ఉండటంతో ప్రజా రవాణా ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. లాక్‌డౌన్ కాలంలో వృద్ధిని చూసిన ఏకైక ఇంధనం ఎల్‌పీజీ గ్యాస్ 3 శాతం పెరిగి 24 లక్షల టన్నులకు చేరుకుంది. విమానయాన రంగం పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించని నేపథ్యంలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం అమ్మకాలు దాదాపు సగానికి పడిపోయాయి.

Advertisement

Next Story

Most Viewed