కరోనాపై తొలి విజయం.. స్వదేశీ కిట్ రూపలక్పన

by srinivas |   ( Updated:2020-03-29 08:19:35.0  )
కరోనాపై తొలి విజయం.. స్వదేశీ కిట్ రూపలక్పన
X

కళ్ల ముందు కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. చాలా తక్కువ సమయంలోనే మనదేశాన్ని కబళించబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పెద్ద ఊరటనిచ్చే అంశం. అతి వేగంగా, అతి తక్కువ ఖర్చుతో కరోనా వైరస్ (కొవిడ్-19)ను నిర్ధారించే కిట్‌ను రూపొందించారు ఓ మహిళా శాస్త్రవేత్త. నిండు గర్భిణి అనే విషయాన్ని కూడా మర్చి కేవలం ఆరు వారాల్లో దీన్ని రూపొందించారు. బిడ్డకు జన్మనివ్వడానికి ఒక్క రోజు ముందు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సమర్పించారు. ప్రస్తుతం ఈ కిట్‌కు అనుమతి వచ్చింది. ఆమెనే మినాల్ దఖావే భోంస్లే..

పుణెలోని మైల్యాబ్‌ డిస్కౌవరి సంస్థలో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాధిపతి మినాల్. గత నెల ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. సరిగ్గా అప్పుడే మైల్యాబ్ యాజమాన్యం ఆమెకు కొవిడ్‌-19 టెస్టింగ్ కిట్‌ను రూపొందించే బాధ్యతను అప్పగించారు. అప్పటికి ఆమె ఎనిమిది నెలల గర్భిణి కూడా. కానీ, దేశానికి పొంచి ఉన్న ముప్పును గుర్తించిన మినాల్ కిట్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కేవలం ఆరు వారాల వ్యవధిలో పని పూర్తి చేశారు. తాము రూపొందించిన టెస్టింగ్ కిట్‌ నమూనాను మార్చి 18న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సమర్పించారు. ఆ తర్వాతి రోజు మినాలే ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుుతం ఈ కిట్‌కు అనుమతి లభించింది. ఒక్కటి రెండ్రోజుల్లో అందుబాటులోకి రానున్నది.

ఎందుకు కీలకం..

దేశంలో కొవిడ్ -19 మహమ్మారి చాప కింద నీరులా ముంచుకొస్తోంది. ‘లాక్‌డౌన్ ఒక్కటే సరిపోదు.. అనుమానితులను గుర్తించి నిర్ధారణ పరీక్షలు జరపడం కీలకం’అని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. కానీ, టెస్టింగ్ కిట్లను మనం జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒక్క దాని ఖరీదు రూ. 4,500. ఒక్కో పరీక్ష జరపడానికి అయ్యే సమయం 6 నుంచి 7 గంటలకు పైనే పడుతుంది. ఈ వ్యయప్రయాసలను తప్పించనుంది మానాలే బృందం రూపొందించిన కిట్. దీని ఖరీదు కేవలం రూ. 1900లు మాత్రమే. ఒక్కో కరోనా టెస్ట్ చేయడానికి పట్టే సమయం 2.30 గంటలే. దీని ద్వారా ఎక్కువ మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు జరపవచ్చు. మహమ్మారి మరింత మందికి అంటుకోకుండా కపాడుకోవచ్చు. ‘కొవిడ్-19 కిట్ చాలా అత్యవసరం. అందుకే సవాల్‌గా స్వీకరించాను. నా దేశానికి సేవ చేయడానికి ఇలా అవకాశం లభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్‌తో పోలిస్తే చాలా తక్కువ సమయంలో కరోనా‌ను నిర్ధారించవచ్చు’ అని మినాల్ పేర్కొన్నారు.

ప్రశంసల జల్లు

శాస్త్రవేత్త మినాల్ కృషిని దిగ్గజ పారిశ్రామికవేత్త ట్విట్టర్‌లో శ్లాఘించారు. మీరు ఈరోజు టెస్టింగ్ కిట్‌ను రూపొందించడం, ఓ పాపకు జన్మనివ్వడం ఒక్కటే చేయలేదు. ఈ దేశానికి కరోనా మహమ్మారితో పోరాడ కలిగే ఓ ఆశాకిరణాన్ని కూడా ఇచ్చారు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఆనంద్ మహీంద్రకు చెందిన సంస్థ వైరస్ బాధితుల కోసం అతి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లను రూపొందించే పనిలో ఉంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా మహీంద్రా రీసార్ట్స్‌లను కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా వాడుకోవడానికి కూడా అనుమతిచ్చారు.

Tags: India’s First, COVID-19, Testing Kit, Giving Birth, Coronavirus

Advertisement

Next Story

Most Viewed