స్విమ్మింగ్ పూల్ కాస్తా.. చేపల చెరువులా!

by Sujitha Rachapalli |   ( Updated:2020-09-01 07:48:17.0  )
స్విమ్మింగ్ పూల్ కాస్తా.. చేపల చెరువులా!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వల్ల పర్యాటక ప్రాంతాలు, పార్కులు, బీచ్‌లు, రిసార్టులు, స్విమ్మింగ్‌ పూల్స్, సర్కస్‌లు అన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఓ వైపు ఆదాయం లేక మరోవైపు మెయింటెనెన్స్ చేయలేక, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక నిర్వాహకులు సతమతమవుతున్నారు. అయితే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయలన్నట్లుగా.. కేరళలోని ఓ ప్రముఖ రిసార్ట్‌‌లో గల లగ్జరీ స్విమ్మింగ్ పూల్‌ను ఆదాయం కోసం చేపల చెరువులా మార్చేశారు నిర్వాహకులు.

కేరళ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. ఎటూ చూసినా పసరిక అందాలు, కొబ్బరి చెట్ల సోయగాలతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ కుమారకామ్‌లో గల ‘అవేదా రిసార్ట్ అండ్ స్పా’లో ఉన్న స్విమ్మింగ్‌పూల్ కూడా ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉంటుంది. ఇరువైపులా పాతతరానికి చెందిన రిసార్టు గదులు, పూల్ మధ్యలో ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల అందాలతో పొడవైన ఆ స్విమ్మింగ్‌పూల్‌ను చూస్తే.. మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పూల్ కాస్త చేపల చెరువులా మారిపోయింది. మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ‘అవేదా రిసార్ట్ అండ్ స్పా’ మూసే ఉంది. కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవడం, పబ్లిక్ ప్లేసులకు అనుమతి ఇవ్వకపోవడంతో రిసార్టును ఇప్పటి వరకు తెరవలేదు. దీంతో ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది రిసార్టు యాజమాన్యం.

ఇందులో భాగంగానే.. రిసార్టులో ఉన్న 7.5 మిలియన్ లీటర్ల లగ్జరీ స్విమ్మింగ్ పూల్‌ను జూన్ నుంచి చేపల చెరువులా మార్చేశారు. అందులో రెండేళ్ల వయసుండే పదహారు వేల పీరల్ స్పాట్ చేప పిల్లలను వేశారు. అవి నవంబరు కల్లా కావాల్సిన సైజుకు పెరిగితే, వాటిని మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేయాలని రిసార్టు నిర్వాహకులు భావిస్తున్నారు. వచ్చిన ఆదాయంతో ఉద్యోగులకు జీతాలు, రిసార్ట్ మెయింటనెన్స్ చేయొచ్చని, అంతేకాదు దీనివల్ల తమ ఉద్యోగులు కూడా పని దొరుకుతుందని వాళ్లు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed