ఫ్రెంచ్ మంచులో 1966 నాటి భారతీయ వార్తాపత్రిక

by Shyam |
ఫ్రెంచ్ మంచులో 1966 నాటి భారతీయ వార్తాపత్రిక
X

చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు అనుకోని ప్రదేశాల్లో దొరికినపుడు భలే ఆసక్తిగా అనిపిస్తుంటుంది. యూరప్‌లోని మౌంట్ బ్లాంక్ పర్వతశ్రేణిలోని బోస్సన్ ఫ్రెంచ్ గ్లేసియర్ మీద కేఫ్ నడుపుతున్న తిమోతీ మోట్టిన్‌కు ఇలాంటి ఆసక్తికర అనుభవాలు తరచుగా జరుగుతుంటాయి. ఇటీవల 1966 నాటి భారతీయ వార్తాపత్రిక.. ముందు పేజీ ఒకటి ఆ గ్లేసియర్‌లో తిమోతీకి దొరికింది. అందులో భారతీయ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని హెడ్డింగ్ రాసి ఉండటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ గ్లేసియర్ మీద 1966, జనవరి 24న ఎయిరిండియా విమానం కుప్పకూలింది. అక్కడ పేరుకుపోయిన మంచు కరిగినప్పుడల్లా కొన్ని శిథిలాలు, వస్తువులు చెక్కుచెదరకుండా బయటపడుతుంటాయి.

ఆ విమానం కుప్పకూలిన ప్రాంతానికి కొద్ది దూరంలో తిమోతీ నడుపుతున్న ‘లా కానబే దు చెర్రో కేఫ్’ ఉంటుంది. ఆనాడు జరిగిన విమాన ప్రమాదంలో 177 మంది మరణించారు. అప్పుడప్పుడు దొరికిన శిథిలాలను సేకరించిన తిమోతీ.. తన కేఫ్‌లో ఒక చిన్న మ్యూజియం నడుపుతున్నాడు. అయితే ఇటీవల దొరికిన నేషనల్ హెరాల్డ్, ఎకానమిక్ టైమ్స్ వార్తాపత్రికలు ఇంకా చదవడానికి అనువుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని తిమోతీ అన్నారు. ఆరు దశాబ్దాలుగా మంచు ముద్దల కింద ఉండి కూడా అక్షరం ముక్క కూడా చెదరకుండా ఉండటం నిజంగా గొప్ప విషయమని తిమోతీ అభిప్రాయపడ్డారు. వీటిని భారత విదేశీ మంత్రిత్వ శాఖకు పంపిస్తానని కూడా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed