మరోసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?

by Anukaran |   ( Updated:2020-10-14 06:46:41.0  )
మరోసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ భయంకరమైన సంక్షోభం నుంచి కోలుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక, ద్రవ్యత నిర్ణయాలతో పాటు మరిన్ని నిర్మాణాత్మక విధానాలను కొనసాగించాలని ఐఎంఎఫ్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తన వార్షిక దృక్పథంలో 2020 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిని 10.3 శాతం ప్రతికూలంగా ఉంటుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

అదే సమయంలో 2021లో 8.8 శాతం వృద్ధి రేటుతో బౌన్స్‌బ్యాక్ అయ్యే అవకాశముందని మంగళవారం అభిప్రాయపడింది. ఈ క్రమంలో వార్షిక సమావేశాల సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఐఎంఎఫ్ పరిశోధనా విభాగం డివిజన్ చీఫ్ మల్హర్ శ్యామ్..మహమ్మారి బారిన పడిన గృహాలు, సంస్థలకు సాయమందించేందుకు ఇంకా అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష మద్దతు, పన్ను ఉపశమన చర్యల ద్వారా ఆర్థిక మద్దతు ఇవ్వాలని, ద్రవ్య మద్దతు చర్యలపై తక్కువ ఆధారపడుతూ, క్రెడిట్ హామీలను ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు తీసుకున్న విధానాలతో పాటు మరిన్ని ప్రత్యక్ష ఉపశమనాలు అందించే అవకాశాలున్నాయని భావిస్తున్నామని, ఇంకా పలు సంస్కరణలు తీసుకోవడం ద్వారా ఫలితాలు సానుకూలంగా మారే పరిస్థితులున్నాయని ఆయన చెప్పారు. అలాగే, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలను ప్రకటించినప్పటికీ, ఇంకా తగ్గించే వీలుందని నమ్ముతున్నామన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చిన తర్వాత మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నామని మల్హర్ శ్యామ్ తెలిపారు.

Advertisement

Next Story