నేపాల్ వాదన అంగీకారయోగ్యం కాదు: భారత్

by Shamantha N |
నేపాల్ వాదన అంగీకారయోగ్యం కాదు: భారత్
X

న్యూఢిల్లీ: నేపాల్ పార్లమెంటు నిర్ణయంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత భూభాగాన్ని తమదిగా పేర్కొంటున్న మ్యాప్‌కు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలపడంపై స్పందిస్తూ.. అది అంగీకారయోగ్యం కాదన్నది. ఈ అంశంపై భారత్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. నేపాల్ వాదనకు చారిత్రక ఆధారాల్లేవని, ఈ వాదన సమర్థనీయం కాదని తెలిపారు. ప్రస్తుతం సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్యనున్న ఏకాభిప్రాయాన్ని ఈ చర్య ఉల్లంఘిస్తున్నదని వివరించారు.

గతనెలలో ఈ మ్యాప్‌ను నేపాల్ ప్రభుత్వం ఆమోదించినప్పుడే భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం ఏకపక్షమని, చారిత్రక ఆధారాల్లేని వాదన అని హెచ్చరించింది.

ఉత్తరాఖండ్‌కు చెందిన లిపులేఖ్ పాస్, లింపియదురా, కాలాపానీలాంటి ప్రాంతాలను నేపాల్‌కు చెందినవిగా ఆ చిత్రిస్తున్న మ్యాప్‌ను ఆమోదించేందుకు ప్రచండ ప్రభుత్వం ఆ దేశ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు పార్లమెంటులోని 258 మంది చట్టసభ్యులు ఆమోదం తెలిపారు. ఒక్కరూ వ్యతిరేకించలేదు. బిల్లు ప్రవేశానికి పూర్వమే ప్రతిపక్షమూ ఆ బిల్లును ఆమోదిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మూడింట రెండొంతుల మెజార్టీతో పాస్ అయిన ఈ బిల్లు తర్వాత జాతీయ అసెంబ్లీకి చేరనుంది. సవరణలు సూచించేందుకు అసెంబ్లీకి 72 గంటల సమయం ఉంది. అధికార పార్టీకి అసెంబ్లీలోనూ మెజార్టీ ఉండటంతో అక్కడా ఈ బిల్లు నెగ్గే అవకాశమే ఉంది. అనంతరం ఈ బిల్లు అధ్యక్షుడి వద్దకు చేరుతుంది. అధ్యక్షుడి ఆమోదం తర్వాత రాజ్యాంగంలో చేరుతుంది. అప్పటి నుంచి భారత భూభాగాలున్న నేపాల్ మ్యాప్ అధికారికం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed