- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్, చైనా ఘర్షణలకు ముడిసరుకే కారణమంట!
భారత్-చైనా సరిహద్దులో ఇటీవల జరిగిన ఘర్షణల ప్రభావం రెండు దేశాల వాణిజ్య లావాదేవీల మీద పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 90 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అందులో చైనా నుంచి మన దేశానికి వచ్చే దిగుమతులే అధికం. సుమారు రెండింతలు పైగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటే, మూడింట ఒక వంతు కూడా మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు జరగవు. ప్రస్తుతం ఎగుమతులు, దిగుమతులు రెండూ దెబ్బతింటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫార్మా రంగం మీదనే తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు.
దిశ, న్యూస్ బ్యూరో: ఓ వైపు కరోనా వైరస్ తో భారత్ అతలాకుతలమైంది. మరో వైపు చైనా దుందుడుకు విధానాలతో భారతీయులంతా ఆగ్రహంతో ఉన్నారు. చైనా ఉత్పత్తులపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. ఒక్కొక్క రంగంలోని వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. స్వదేశీ వస్తు వినియోగాన్ని పెంచాలంటూ వినతులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫార్మా రంగానికి ముడి సరుకులతోనే సమస్య ఏర్పడే అవకాశముంది. మందుల తయారీలో వినియోగించే బల్క్, ఇంటర్మీడియేట్స్ లభ్యత కష్టమవుతుందని నిపుణులు వాపోతున్నారు. ప్రపంచ అవసరాల్లో మొత్తం 10-12% ఒక్క చైనానే సమకూరుస్తుంది. ప్రపంచ మొత్తం ట్రేడ్ వ్యాల్యూ 20 ట్రిలియన్ డాలర్లయితే, ఒక్క చైనానే 2.5 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుంటుంది. ప్రస్తుతం భారత ఫార్మా కంపెనీలు బల్క్ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను చైనా నుంచే అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఏపీఐ ల విలువ రూ 25,000 కోట్లుగా తేలింది. మన దేశం మొత్తంగా దిగుమతి చేసుకునే ఫార్మా ఉత్పత్తుల్లో 70 శాతానికి సమానం కావటం గమనార్హం.
దశాబ్దాలుగా అక్కడి నుంచే
చైనా నుంచి ఏటా రూ.17,000 కోట్ల విలువైన ముడి సరుకు (ఏపీఐ) భారత్ దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటోంది. గడిచిన నాలుగేళ్లలో చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల విలువ దాదాపు 30% పెరిగింది. తక్కువ ధరకే ఎంత సరుకు అయినా సప్లై చేయగలిగే సామర్థ్యం ఉండటంతో మన దేశంలోని కంపెనీలు చైనా నుంచి దిగుమతులకు మొగ్గు చూపుతున్నాయి. భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ గుర్తింపు పొందిన ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీపీసీఐ) రిపోర్టు ప్రకారం 2018-19లో భారత్ నుంచి జరిగిన మందుల ఎగుమతుల అంచనా విలువ 19.14 బిలియన్ డాలర్లుగా ఉంది. జెనెరిక్ మందుల తయారీలో, వాటి ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. 2019లో భారత్ 201 దేశాలకు జెనెరిక్ మందులు ఎగుమతి చేసింది. కానీ ఈ మందులు తయారు చేయడానికి భారత్ ఇప్పటికీ చైనా మీదే ఆధారపడి ఉంది. చైనా నుంచి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ (ఏపీఐ)ను దిగుమతి చేసుకుంటోంది. మందుల తయారీకి ఇది ముడి సరుకు. భారత కంపెనీలు ఏపీఐ ఉత్పత్తికి కూడా చైనాపై ఆధారపడ్డాయి.
నిలిచిన దిగుమతులు
చైనా యుద్ధం, కరోనా వైరస్ ప్రభావం అసాధారణ స్థాయిలో ఉన్నట్లు ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. దిగుమతులు-ఎగుమతులపై తీవ్రంగా ఉంది. ఏపీఐ దిగుమతులు ఆగిపోవడంతో చాల కంపెనీల మందుల ఉత్పత్తి తగ్గుతోంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మందుల సరఫరాపై కనిపించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే భారత ఫార్మా ఐదో అతి పెద్ద పరిశ్రమగా నిలుస్తోంది. మొత్తం ప్రపంచ ఔషధాల్లో ఐదో వంతు మన దేశమే సరఫరా చేస్తుంది. మన పరిశ్రమ పరిమాణం రూ.2 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఏటా రూ.లక్ష కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతుండగా, దాదాపు అదే పరిమాణంలో మన దేశీయ ఔషధ మార్కెట్ ఉంటుంది. హైదరాబాద్ దేశంలోని ఫార్మా రంగానికి రాజధానిగా వర్ధిల్లుతోంది. మొత్తం దేశీయ ఫార్మా రంగంలో సుమారు 30% వాటా కలిగి ఉండటంతో ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక ప్రసిద్ధ కంపెనీలు రెడ్డీస్ ల్యాబ్, హెటిరో, అరబిందో, దివిస్, నాట్కో వంటివి ఇక్కడే ఉన్నాయి. వందలాది కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయ్యే మందుల్లో 55 శాతం ఉత్తర అమెరికా, యూరప్ దిగుమతి చేసుకుంటాయి. ఆఫ్రికా జెనెరిక్ మందుల మార్కెట్లో భారత్‌కు 50 శాతం వాటా ఉంది. భారత్ నుంచి మందులు దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. భారత్ 2018-19లో ప్రపంచంలోని 201 దేశాలకు 9.52 కోట్ల డాలర్ల మందులు ఎగుమతి చేసింది. ఫార్మస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వార్షిక రిపోర్టు ప్రకారం 2018-19లో భారత్ నుంచి ఎగుమతి అయిన మొత్తం మందుల విలువ 19 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
38 రకాలపై ప్రభావం
చైనాతో యుద్ధం, కరోనా వైరస్ వ్యాప్తితో 38 రకాల (ముడి సరుకు) ఏపీఐ దిగుమతులు ఆగిపోవడంతో 60 శాతం కంపెనీల మందుల ఉత్పత్తి తగ్గుతోంది. ఇవి మరికొంత కాలం ఆగిపోతే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మందుల కొరత ఏర్పడవచ్చు. పారాసెటామల్, అసిడిటీ చికిత్సకు వినియోగించే ఔషధాలతయారీలో వినియోగించే బల్క్, ఇంటర్మీడియేట్స్ ( రానిటిడిన్, ఒమెప్రజోల్), విటమిన్లు, ఘగర్ చికిత్సకు వినియోగించే ఔషధాలతయారీలో వినియోగించే బల్క్, ఇంటర్మీడియేట్స్, యాంటీ బయాటిక్స్, యాంటీ-వైరల్, ఆస్తమా, ఎలర్జీ వ్యాధులకు వినియోగించే మాంటెలుకాస్ట్, ఆంపిసిల్లిన్, అజిత్రోమైసిన్, ఆమాక్సలిన్, హార్మోనల్ పిల్స్, రక్తపోటు చికిత్సకు వినియోగించే ఔషధాలతయారీలో వినియోగించే బల్క్, ఇంటర్మీడియేట్స్, గుండె జబ్బుల చికిత్సకు వినియోగించే ఔషధాలతయారీలో వినియోగించే బల్క్, ఇంటర్మీడియేట్స్‌కు కొరత ఏర్పడే అవకాశం ఉందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డిమాండ్ ప్రకారం తయారు చేసే 90 శాతం తట్టు టీకాలను భారత్ తయారు చేస్తోంది. డీపీటీ, బీసీజీ వ్యాక్సిన్లలో సుమారు 65 శాతం భారత్‌లోనే తయారవుతాయి. జెనెరిక్ మందులు తయారు చేసే ప్రపంచంలోని టాప్ 20లోనూ ఇండియా ఉంది. ప్రస్తుత పరిస్థితులను అధిగమించడం ద్వారా మెరుగైన ఫార్మా వ్యవస్థ ఏర్పడుతుందంటున్నారు.
ముచ్చర్ల ఫార్మాపై సందిగ్థత
మహేశ్వరం నియోజకవర్గంలోని ముచ్చర్లలో ఐదేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీకి అంకురార్పణ చేసింది. చైనా, ఇతర దేశాల నుంచి 50 వరకు కంపెనీలు ఇక్కడికి రానున్నట్లు అప్పటి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ప్రకటించారు. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు 220 దేశాలకు వెళ్తున్నాయని, 2015లోనే సుమారు రూ.1.14 లక్షల కోట్ల వరకు ఎగుమతులు ఉన్నట్లు ప్రకటించారు. ఇది 2020 నాటికి రూ.2.31 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. పైగా హైదరాబాద్ లోనే 400కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని, మూడో వంతు బల్క్ డ్రగ్ ఎగుమతులు సాగుతున్నాయని వెల్లడించారు. 6,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫార్మా సిటీకి చైనా నుంచి కూడా కంపెనీలు పెద్ద ఎత్తున రానున్నట్లు అంచనా వేశారు. ఐతే ఇప్పుడు స్వదేశీ, చైనా కాకుండా మిగతా దేశాలకు చెందిన కంపెనీలను ఆహ్వానించడం అనివార్యంగా మారనుందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలే మార్గం
చైనా నుంచి దిగుమతి చేసుకుంటోన్న బల్క్ ముడిసరుకులను ఇక్కడే తయారు చేసుకునే అవకాశాలను, సదుపాయాలను కల్పించడం ద్వారా మార్గం సుగమం అవుతుంది. ఉదాహరణకు యాంటీ క్యాన్సర్ డ్రగ్ తయారీ కంపెనీకి కావాల్సిన బల్క్ డ్రగ్ తయారీకి కూడా సదుపాయాలను కల్పించాలి. ఇప్పటికిప్పుడు బల్క్ డ్రగ్ దిగుమతికి అవకాశం లేనప్పుడు మనమే తయారు చేసుకోవడమే మార్గమని ఫార్మకాలజిస్టులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందంటున్నారు. చైనా మీద ఆధారపడకుండా ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.
ఇప్పుడే సరైన సమయం: డా. ఆకుల సంజయ్ రెడ్డి, ఫార్మకాలజిస్ట్, మెంబర్, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్
ఫార్మా రంగంలో ఇండియా రారాజు. ఐతే బల్క్ డ్రగ్స్ పై చైనా ఆధారపడడమే బాగా లేదు. ప్రస్తుతం యుద్ధ మేఘాలు, కరోనా వైరస్ ఆవహించిన నేపథ్యంలో బల్క్ పైనా దృష్టి పెట్టాలి. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాలపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి. దేశీయ కంపెనీలే బల్క్ డ్రగ్ తయారు చేసేందుకు అవసరమైన వసతులు, సదుపాయాలను, ఆర్ధిక వెసులుబాటు కల్పించాలి. పెట్టుబడులు పెట్టే వారికి పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ప్రకటించాలి. అమెరికా కూడా భారత సామర్ధ్యాన్ని గుర్తించింది. అందుకే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా కరోనా వైరస్ నియంత్రణకు మన పై ఆధారపడ్డారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి డ్రగ్ ను దిగుమతి చేసుకున్నారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగారంటే ఇండియా ఫార్మా సత్తా ఏమిటో తెలుస్తోంది. అందుకే ప్రస్తుత విపత్తులోనే బల్క్ డ్రగ్ తయారీపై దృష్టి పెట్టాలి. చైనా దిగుమతులన్నింటినీ బహిష్కరించాలని దేశ ప్రజలంతా కోరుతున్న నేపధ్యంలో కేంద్రం సరైన అడుగులు వేయడం ద్వారా ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయి. అలాగే ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభించే అవకాశం ఉంటుంది.