కొత్త పద్ధతిలో మిడతల గుంపుకి చెక్!

by Shamantha N |
కొత్త పద్ధతిలో మిడతల గుంపుకి చెక్!
X

ఉత్తర భారతంలో గోధుమ, నూనె గింజల పంటలకు భారీ నష్టం కలిగిస్తోన్న మిడతల గుంపులకు చెక్ పెట్టడానికి అధికారులు ఓ కొత్త పద్ధతిని అమలు చేయబోతున్నారు. ప్రత్యేకమైన కంప్యూటర్ల ద్వారా మిడతల గమనాన్ని అంచనా వేసి, ఆయా దారుల్లో డ్రోన్లతో పురుగు మందులు చల్లబోతున్నారు. గతంలో ఎడారి మిడతల గుంపులను భారత అధికారులు బాగానే కట్టడి చేశారు. కానీ మళ్లీ పాకిస్తాన్‌లో చెలరేగిన మిడతల గుంపుల కారణంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే వాటిని ముందే కట్టడి చేయడానికి సాంకేతికతను వినియోగించబోతున్నారు. పెద్ద మొత్తంలో క్రిమిసంహారక మందులను అమర్చుకోవడమే కాకుండా వాటిని చల్లడానికి డ్రోన్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మిడతల గుంపులు ఒకరోజులో దాదాపు 150 కి.మీ.లు ప్రయాణించగలవు. అలాగే తమ బరువు కంటే ఎక్కువ ఆహారాన్ని తినగలవు. ఒక చిన్న మిడతల గుంపు ఒక్క రోజులో 35వేల మందికి సరిపోయే గోధుమలను తినగలదు. ఇప్పటికే ఈ మిడతల గుంపుల దాడి కారణంగా తూర్పు ఆఫ్రికా దేశాలైన సోమాలియా, ఇథియోపియా, కెన్యా, ఎరిత్రియా, డిజిబౌతీలలో ఆహార కొరత పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ గుంపులు టాంజానియా, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు విస్తరించాయి. ఈ మిడతల గుంపుల దాడి కారణంగా పాకిస్తాన్ దేశం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతాలకు పంపి అక్కడ మిడతల గుంపుల ప్రభావాన్ని అంచనా వేయబోతోంది. తర్వాత వాటి దాడిని కట్టడి చేయడానికి ప్రణాళికలు వేయబోతోంది. ఇందుకోసం భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలు చాలా సార్లు ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. చర్చల్లో భాగంగా పాకిస్తాన్‌కి క్రిమిసంహారక మందులు సరఫరా చేయడానికి భారత్ ఒప్పుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story