మొబైల్ తయారీలో చైనాను అధిగమించడమే లక్ష్యం!

by Harish |
మొబైల్ తయారీలో చైనాను అధిగమించడమే లక్ష్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ తయారీ రంగంలో చైనాను అధిగమించడమే భారత్ లక్ష్యమని కేంద్ర టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. భారత్‌ను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా భారత్ మారాలని కోరుకుంటున్నానని అన్నారు.

చైనాను అధిగమించడమే భారత్‌ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టి ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. అన్ని రంగాలకు ఈ పథకాన్ని విస్తరించాలని చూస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా తయారీ రంగంలో భారత్‌ను ప్రత్యామ్నాయంగా మార్చాలనే ఉద్దేశ్యంతోనే పీఎల్ఐ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

దీని ద్వార ఇప్పటివరకు దేశీయ, విదేశీ కంపెనీలు సుమారు రూ. 11 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అంతేకాకుండా రాబోయే ఐదేండ్లలో రూ. 10.5 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ఫోన్‌లను తయారు చేయనున్నట్టు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పెట్టుబడులు పెట్టిన కంపెనీల జాబితాలో అంతర్జాతీయ సంస్థలు శాంసంగ్, యాపిల్ సహా పెగాట్రాన్, విస్ట్రాన్ లాంటి కంపెనీలు ఉన్నాయని చెప్పారు. దేశీయ సంస్థలైన మైక్రోమ్యాక్స్, ఆప్టిమస్, లావా సంస్థలు మొబైల్‌ఫోన్ ఉత్పత్తులను పెంచుతాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed