రేపే తేలనున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ భవితవ్యం

by Shyam |   ( Updated:2021-12-02 09:50:19.0  )
రేపే తేలనున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ భవితవ్యం
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022 నుంచి లీగ్‌లో 10 జట్లు పాల్గొననున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అక్టోబర్‌లో రెండు కొత్త జట్ల కోసం తెరిచిన టెండర్లలో లక్నో జట్టును ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ. 7090 కోట్లకు, అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేశాయి. లక్నో జట్టుకు ఇప్పటికే బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సదరు ఫ్రాంచైజీ సన్నాహాలు మొదలు పెట్టింది. మరోవైపు అహ్మదాబాద్ జట్టుకు మాత్రం ఇంకా క్లియరెన్స్ రాలేదు. టెండర్లు ముగిసి నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ జట్టుకు బీసీసీఐ నుంచి ఫ్రాంచైజీ నడిపించుకోవాలనే ఉత్తర్వులు జారీ కాలేదు.

అహ్మదాబాద్ జట్టును దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్‌కు బెట్టింగ్ కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయని బీసీసీఐకి ఫిర్యాదులు అందడంతో దానిపై విచారణ ప్రారంభించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. బీసీసీఐ, జీసీ సభ్యులతో ఆమోదం మేరకు న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్వతంత్ర కమిటీ అహ్మదాబాద్ జట్టు భవితవ్యంపై శుక్రవారం జరిగే భేటీలో తేల్చనున్నది. ఈ సమస్యను త్వరగా తేల్చడం ద్వారా ఐపీఎల్ 2022 ప్రక్రియ మరింత ముందుకు వెళ్తుంది. రెండు కొత్త జట్లకు పికప్ ఆప్షన్‌ను ఓకే సారి ఇస్తారు. ఆ తర్వాత మెగా వేలానికి రంగం సిద్ధం చేయాల్సి ఉన్నది.

Advertisement

Next Story