పూర్తి కాని ధాన్యం కొనుగోళ్లు.. మొలకెత్తిన వడ్లు

by Shyam |
Grain purchasing centers
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్‌లో లక్ష్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుండగా.. లక్షల మంది రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు మార్కెట్ స్థలాల్లో ఎదురుచూస్తున్నారు. నెల రోజుల నుంచి వడ్ల బస్తాలు మార్కెట్లలోనే ఉండటంతో ఇటీవల వర్షాలు కురిసి మొలకలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతన్నలు గగ్గోలు పెడుతుండగా.. కడుపు మండిన మరికొందరు రైతులు ధాన్యాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల పైగా ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయ గణంకాలు చెబుతున్నాయి. 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం రాష్ట్రంలో 6,962 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికీ మార్కెట్ స్థలాల్లో వడ్ల కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గ్రామాల్లో ప్రారంభించిన మార్కెట్ యార్డుల్లో వర్షం నుంచి రక్షించుకునేందుకు టార్ఫలిన్లు, షెడ్స్ కూడా లేవు. ఇటీవల నైరుతి రుతు పవనాల ప్రభావంతో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసన వర్షంలో ధాన్యం తడిసిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వడ్లను కనీసం ఆరబెట్టుకుని పరిస్థితి మార్కెట్ యార్డుల్లో లేదు. తేమశాతం ఎక్కువుందంటూ కొనుగోలు చేయకపోవడంతో బస్తాల్లోనే మొలకలు వస్తున్నాయి.

మార్కెట్లలో సరైన వసతులు కల్పించలేకపోయిన ప్రభుత్వం కనీసం కొనుగోళ్లు, ట్రాన్స్ పోర్టును కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోవడమే ఈ సమస్యకు కారణంగా కనిపిస్తోంది. సీజన్ కొనుగోళ్లు ప్రారంభమైన నాటినుంచే గన్నీ బ్యాగులు, లారీల సమస్యలు ముందుకొచ్చాయి. ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాల్లో ధాన్యాలు తెచ్చిన రైతులకు టోకెన్ల పద్ధతిని ఏర్పాటు చేశారు. గన్నీ బ్యాగులు లేకపోవడంతో కొనుగోళ్లు జరపడం లేదంటూ అక్కడ సిబ్బంది చెబుతుండటంతో రైతులు కూడా ఏమీ చేయలేక వెనుదిరిగిపోయారు. అయితే వర్షాకాలం ప్రారంభమవుతుండటం, వాతావరణం శీతలంగా మారి చెదరుమొదురు వానలు పడి మార్కెట్లలోని ధాన్యం మొలకలు ఎత్తుతున్నాయి. ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఆరుగాలం కష్టపడిన పంట నీళ్ల పాలయిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతన్నల ఆగ్రహావేశాలు.. ధాన్యం దహనాలు

రాష్ట్రంలో వరిసాగు, దిగుబడి తమ వల్లే పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం మార్కెట్ సమస్యలను పరిష్కరించి, రైతుల ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో విఫలమయినట్టు విమర్శలు వస్తున్నాయి. గతేడాది కంటే అధిక పంట దిగుబడి వచ్చినట్టు ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వ విభాగాలు ఆ మేరకు ఎందుకు చర్యలు చేపట్టలేకపోయిందని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. నల్గొండ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలకు మార్కెట్లలోని ధాన్యం మొలకలు వచ్చాయి. ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ మార్కెట్ యార్డుల్లో ధాన్యం ఉండిపోయింది. వడ్లు కొనుగోలు చేయకపోవడానికి తోడు వర్షాలు కూడా వస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, మార్కెట్లలో దోచుకుంటున్నారని వికారాబాద్ జిల్లా పాలేపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి తమ నిరసన తెలిపారు. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారనుంది.

Advertisement

Next Story