ఫిక‌ర్ మ‌త్ ‘క‌రోనా’

by Shyam |
ఫిక‌ర్ మ‌త్ ‘క‌రోనా’
X

19 రోజుల్లో కొత్త కేసుల న‌మోదు నిల్‌

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌రోనా వైరస్ (కొవిడ్ -19) కోర‌ల్లో నుంచి బ‌య‌ట‌ప‌డుతోంది. గ‌డిచిన 19 రోజుల్లో జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోదుకాలేదు. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 4 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా ఇందులో ఇద్ద‌రు ఇప్ప‌టికే పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో కొన‌సాగుతున్నారు. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లో తమ జిల్లా కొవిడ్ 19 నుంచి ఫ్రీ అవుతుందని పలువురు జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.

ఇక లోక‌ల్ కాంటాక్టు రెండో కేసు వ్య‌క్తి నుంచి వైర‌స్ సోకిన ఇద్ద‌రు గాంధీ ఆస్ప‌త్రిలోనే చికిత్స పొందుతున్నారు. మార్చి 12న జిల్లాలో తొలి కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న‌తో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డ్డారు. అశ్వాపురం మండ‌లానికి చెందిన విద్యార్థిని చ‌దువుకోసం ఇట‌లీకి వెళ్లి తిరిగి దేశానికి వ‌చ్చింది. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో గాంధీ ఆస్ప‌త్రిలో చేర‌డంతో వైద్య‌ప‌రీక్ష‌ల్లో కొవిడ్ 19 పాజిటివ్ వ‌చ్చింది. అలాగే లండ‌న్ నుంచి వ‌చ్చిన ఓ వైద్య విద్యార్థికి మార్చి 22న పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆ త‌ర్వాత విద్యార్థి కుటుంబీకులకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా తండ్రికి, ఇంటి వంట‌మ‌నిషికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. జిల్లాలో 4 పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డంతో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం వాసుల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి.

కేంద్ర ప్ర‌భుత్వం కూడా భ‌ద్రాద్రి జిల్లాను రెడ్‌జోన్‌లో చేర్చ‌డంతో ఈ భ‌యం మ‌రింత ఎక్కువైంది. అయితే, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల‌తో జిల్లా యంత్రాంగం లాక్‌డౌన్ అమ‌లుకు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ చ‌ర్య‌లు లోకల్ కాంటాక్టులు పెర‌గ‌కుండా నివారించాయి.

ప్ర‌స్తుతం జిల్లాలో కేసుల సంఖ్య ఇలా ఉంది.

విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన దాదాపు 242 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరిని రోజూ రెండుసార్లు త‌నిఖీ చేసేందుకు వైద్య బృందాల‌ను ఏర్పాటు చేశారు. హోం క్వారంటైన్ పాటిస్తున్న వారిపై నిఘా ఉంచ‌డంతో పాటు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారిని మ‌ణుగూరులో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణుగూరు క్వారంటైన్‌లో 27 మందిని తరలించారు. త‌బ్లీఘీ జ‌మాత్ ఘ‌ట‌న‌తో రాష్ట్రంలో కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే.
భ‌ద్రాద్రి కొత్త‌గూడెంకు చెందిన దాదాపు 10మంది కూడా ఢిల్లీలో జ‌రిగిన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్లు అధికారులు గుర్తించి వారిని వెంట‌నే ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి ప‌రీక్ష‌లు చేయించారు. అంద‌రికీ నెగెటివ్ రిపోర్టు రావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆ ప‌ది మంది హోం క్వారంటైన్‌లో కొనసాగుతున్నారు. ఇక మొద‌టి, రెండో పాజిటివ్ కేసుల‌తో (విద్యార్థుల‌తో) స‌న్నిహితంగా మెదిలిన వారికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారికీ నెగెటివ్ రావ‌డంతో హోం క్వారంటైన్‌కు ఆదేశించారు. ప్ర‌స్తుతం వారి గ‌డ‌వు కూడా పూర్తి కావస్తుండటంతో అధికారుల్లో క‌రోనాను వ్యాప్తిని అరిక‌ట్టామ‌నే ధీమా క‌నిపిస్తోంది.

ఇంటి వ‌ద్ద‌కు నిత్యావ‌స‌రాలు..

లాక్‌డౌన్ నేప‌థ్యంలో కొత్త‌గూడెంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్ర‌జ‌లెవ‌రూ రోడ్ల‌పైకి రాకుండా ఉండేందుకు ఇళ్ల వ‌ద్ద‌కే నిత్యావ‌స‌రాలను చేరస్తున్నారు. ఇందుకోసం కొంత‌మంది మార్కెట్ సిబ్బందిని, డ్వాక్రా సంఘాల స‌భ్యుల‌తో మొబైల్ కేంద్రాల‌తో ఇళ్ల వ‌ద్ద‌నే కూర‌గాయాలు కొనుగోలు చేసేలా చేశారు. ఇక కొద్దిరోజులుగా జిల్లాలో ఉదయం 6 నుంచి మ‌ధ్యాహ్నం ఆరుగంట‌ల వ‌ర‌కే దుకాణాల‌ను కొన‌సాగిస్తున్నారు. ఆ త‌ర్వాత దుకాణాల‌ను తెరిచి ఉంచిన వారికి జ‌రిమానాలు విధించ‌డంతో పాటు కేసుల న‌మోదుకు కూడా వెన‌కాడ‌టం లేదు. పోలీసులు, అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి రావ‌డం జ‌నాలు మానుకున్నారు.

Tags: no covid 19 cases, from 19 days, coronavirus, bhadradri, lockdown

Advertisement

Next Story

Most Viewed