ఆపత్కాలంలో మేమొక్కటి.. కరోనా ఒంటరి

by sudharani |   ( Updated:2020-03-15 06:41:30.0  )
ఆపత్కాలంలో మేమొక్కటి.. కరోనా ఒంటరి
X

దిశ,వెబ్‌డెస్క్: మన ఆరోగ్యం వ్యక్తిగతంకాదని కరోనా వైరస్ గుర్తుకు తెస్తున్నది. వ్యక్తివాదానికి మరలుతున్న సమాజంలో ఈ కుదుపు పరస్పర సంఘీభావం, ఆప్యాయతలను మరోసారి తట్టిలేపుతున్నది. ఇందుకు కరోనాతో కకావికలమవుతున్న ఇటలీ వేదికగా మారింది. చైనా తర్వాత అత్యధికంగా నష్టోయిన దేశం ఇటలీ. సుమారు 17,660 మందికి ఈ వైరస్ సోకగా.. 1,441 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలొదిలారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో కాస్త ఆలస్యంగా అప్రమత్తమైన ఇటలీ సర్కారు.. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నది. స్కూళ్లు, సినిమా హాళ్లు, పబ్‌లు బంద్. అంతేకాదు.. కొన్ని పట్టణాల్లో ఇంటిలో నుంచి బయటికి రావాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నది. నిత్యావసర వస్తులు, కొన్ని అత్యవసర పనులకు మాత్రమే బయటికి అనుమతిస్తున్నారు. వైరస్ విస్తరణకు కళ్లెం వేసేందుకు ప్రజలను ఇంటికే పరిమితం చేస్తున్నది.

కరోనా పాజిటివ్ కేసులు పెరిగినకొద్దీ అక్కడి వైద్యులు నిరాటంకంగా పనిచేయాల్సి వస్తున్నది. వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్లకు కృతజ్ఞతలు చెబుతూ ఇటలీ వాసులు ఇంటి బాల్కానీలోకి చేరి పాటలు పాడుతున్నారు. సంగీతం వినిపిస్తున్నారు. అలాగే, వైరస్‌తో బాధపడుతున్నవారికి సంఘీభావాన్ని తెలుపుతున్నారు. ఈ ఆపత్కాలంలో మీకు తోడుగా మేమున్నాం అంటూ ఎవరి ఇంటి బయటి బాల్కనీలో వారే నిలుచుని మాట సహాయం, పాట సహాయం చేసుకుంటున్నారు. దేశమంతా నిశ్శబ్దాన్నిదాల్చి ఉంటే దాన్ని చీల్చుతూ.. ఇటాలియన్లు తమ సోదరభావాన్ని పలికిస్తున్నారు. ‘మా దేశం ఎక్కడా తక్కువ చేయడం లేదు. మా వైద్యులు కఠోరంగా శ్రమిస్తున్నారు. మేమంతా వ్యక్తిగతం కాదు.. ఈ ఆపత్కాలంలో కలిసే ఉన్నాం’ అని చెబుతున్నారు. ‘బాల్కనీల్లో ఉన్నా.. మేం చేతిలో చేయేసి పలకరించుకోలేకపోవచ్చు కానీ, మేం పరస్పరం మాటలాడుతూ, పాటలు పాడుతూ ధైర్యాన్ని నింపుకోవచ్చు’ అని ఓ యువకుడు అన్నాడు.

ఇంటి బాల్కనీలకు జాతీయ జెండాను కట్టుకుని జాతీయ గీతాన్ని అలాపిస్తున్నారు. ‘మేమంతా ఒక్కటే. మేం చావడానికి సిద్ధమే. మేం ఇటాలియన్లం. మా సంస్కృతిలో భాగస్తులం. మేమంతా ఒక్కటని ఫీల్ కావడానికి ఇలా బాల్కనీలో సంఘీభావ పాటలు పడతాం. ఇటలీ బాధను మేమంతా పంచుకుంటాం’ అని 51 ఏళ్ల జార్జియో అల్బెర్టిని అన్నారు.

tags : italy, singing, encourage, balconies, milan, music, national flag

Advertisement

Next Story

Most Viewed