రైతులు రాలిపోతున్నారు.. చావు లెక్క రోజుకు 50

by Shyam |   ( Updated:2020-06-05 02:34:46.0  )
రైతులు రాలిపోతున్నారు..  చావు లెక్క రోజుకు 50
X

మన్ను పిసికి అన్నం పండిస్తడు.. కానీ, సమస్యలు అతడిని గొంతు పిసికి చంపేస్తున్నాయి. భూమిని నమ్ముకున్నడు.. కానీ, ఆకలికి తాళలేక అతడు భూమిలో కలిసిపోతున్నడు.. అప్పు అతడి ప్రాణాలకు ముప్పు అయి ఉసురుతీస్తోంది. ఇదీ తెలంగాణ రైతన్న ముఖచిత్రం.. ‘ఎద్దు ఏడ్సిన ఎవుసం.. రైతు ఏడ్సినా రాజ్యం బాగుపడదంటరు కదా పెద్దలు.. మరి తెలంగాణ పల్లెపల్లెనా చెమ్మగిల్లిన కళ్లతోనే కదా రైతు కనిపించేది! ఏ రైతు కుటుంబాన్ని పలకరించినా వలపోతే కదా వినిపించేది! మరి మన అన్నదాత గురించి కేంద్ర ప్రభుత్వం ఏమంటుందో, మన సీఎం కేసీఆర్ ఏం చెబుతున్నడో ఓసారి చూద్దామా…

దిశ, న్యూస్ బ్యూరో: ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం’ అని ప్రకటించింది. దేశంలోనే సంపన్న రైతు ఎక్కడున్నాడంటే తెలంగాణలోనే అని గర్వంగా చెప్పుకునే రోజులు ఎంతో దూరంలో లేవని రాష్ట్ర సీఎం కేసీఆర్ అంటుంటారు. తెలంగాణలో మాత్రం సగటున రోజుకు 50 మంది చొప్పున రైతులు చనిపోతున్నారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి (2018 పంద్రాగస్టు) నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్రం మొత్తం మీద 26,698 మంది రైతులు చనిపోయారు. ఇందులో ప్రభుత్వ లెక్కల ప్రకారం సహజ మరణాలు 18,920 ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 6,036 ‘ఇతరాలు’ అనే కేటగిరీకి సంబంధించినవి. యాక్సిడెంట్లలో 1,313 మంది, విద్యుత్‌షాక్‌తో 308 మంది, పాముకాటుతో 120 మంది చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ‘ఇతరాలు’ అనే కేటగిరీలో ప్రధానమైనది ఆకలి బాధలు, ఆత్మహత్యలే. ఈ ఏడాదిన్నర కాలంలో చనిపోయిన రైతులకు రైతుబీమా పథకం కింద నష్టపరిహారం సైతం అందించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం చెప్పిన ఈ లెక్కలన్నీ సొంత భూమి కలిగిన రైతులవే. గుంట భూమి సైతం లేని కౌలు రైతులు ఎంతో మంది చనిపోయారు? ఆ లెక్కలేవీ ప్రభుత్వ గణాంకాల్లోకి రావు. వారికి ప్రభుత్వం నుంచి రైతు బీమా సాయమూ అందదు. ఎందుకంటే వారంతా కౌలు రైతులు. అందుకే రైతు బీమా పథకం పరిధిలోకి రాని రైతులు చనిపోతే ఆ వివరాలు ఈ లెక్కల్లోకి చేర్చడం లేదు.

మృతుల్లో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ

రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా అందించే విధంగా ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2018 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం కోసం ఆ ఏడాది ప్రభుత్వం రూ.658.73 కోట్లను రైతుల తరపున ప్రీమియం రూపంలో చెల్లించింది. ఆ మరుసటి ఏడాది (2019 ఆగస్టు) రూ.1167.34 కోట్లను బడ్జెట్‌లో కేటాయించి రూ.1136.79 కోట్లను విడుదల చేసింది. చివరకు రూ.1117.22 కోట్లను బీమా సంస్థకు చెల్లించింది. రాష్ట్రం మొత్తం మీద సుమారు 54 లక్షల మంది రైతులు ఉన్నా ఈ పథకం కింద 2018-19లో అర్హులైనవారు మాత్రం కేవలం 31.24 లక్షల మందే. ఆ తర్వాత సంవత్సరంలో అర్హులైనవారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. మొత్తం 32.09 లక్షల మంది రైతులు ఈ పథకంలో చేరారు. పట్టాదారు పాసుబుక్‌లు లేనివారు ఈ పథకానికి అర్హులు కాలేకపోయారు. దీంతో లక్షలాది మంది కౌలురైతులు రైతుబీమా పథకానికి నోచుకోలేకపోయారు.

రైతుబీమా పథకం 2018 ఆగస్టు నుంచి అమల్లోకి రాగా పన్నెండు నెలల కాలంలో 17,484 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయినట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం పేర్కొంది. ఇందులో గరిష్టంగా ఒక ఎకరం నుంచి రెండున్నర ఎకరాల భూమి ఉన్న చిన్న రైతుల సంఖ్య 8,394. అర్థ ఎకరంలోపు ఉన్నవారి సంఖ్య 4,561. ఇక రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల భూమి కలిగిన రైతుల సంఖ్య 3,243. ఐదు నుంచి పది ఎకరాల భూమి కలిగి మరణించి రైతు బీమా అందుకున్న లబ్ధిపొందిన కుటుంబాల సంఖ్య 1,455. పది ఎకరాలకంటే ఎక్కువ భూమి ఉండి రైతుబీమాను అందుకున్నవారి సంఖ్య 188. ఇక 2019 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు రాష్ట్రవ్యాప్తంగా 8,857 మంది రైతులు చనిపోగా ఆ కుటుంబాలకు రైతుబీమా ద్వారా సాయం అందించినట్టు తెలిపింది.

ప్రమాదాలే అధికం

ఏ కారణంగా చనిపోయినా రైతు కుటుంబానికి రైతుబీమా ద్వారా పరిహారం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ రెండేండ్ల కాలంలో చనిపోయిన మొత్తం రైతుల వివరాలను పరిశీలిస్తే సహజ మరణాల తర్వాత సింహభాగం ప్రమాదాల కారణంగా చనిపోతున్నట్టు తేలింది. 2018 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు మొత్తం 18,920 సహజ మరణాలేనని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. యాక్సిడెంట్లలో 1,313 మంది, విద్యుత్ షాక్ ద్వారా 308 మంది, ఆత్మహత్యలు సహా ఇతర కారణాల ద్వారా 6,036 మంది, పాముకాటు ద్వారా 120 మంది చనిపోయినట్టు తేలింది. వీరందరికీ రైతుబీమా ద్వారా పరిహారం అందినట్టు పేర్కొంది. పాముకాటు ద్వారా ఈ ఏడాదిన్నర కాలంలో సుమారు 625 మంది చనిపోయినట్టు రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలవారీ రైతు సంఘం నాయకుల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం గణనీయ సంఖ్యలో రైతులు విద్యుత్ షాక్, పాముకాటు ద్వారా మరణిస్తున్నట్టు పేర్కొన్నారు.

మృతిచెందిన రైతుల్లో 4,966 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. 2018-19 రైతుబీమాలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 874.20 కోట్ల మేర పరిహారం అందించినట్టు వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సుమారు 328.85 కోట్ల మేర పరిహారం అందించినట్టు పేర్కొంది. ఇవన్నీ రైతుబీమా లెక్కల్లోకి వచ్చే మరణాలు మాత్రమే. పట్టాదారు పాస్ బుక్ లేని రైతులు, కౌలు రైతులు, ఈ పథకంలో చేరని రైతుల మరణాలేవీ ప్రభుత్వ లెక్కల్లోకి చేరవు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూస్తే రోజుకు సగటున 50 మంది రైతులు చనిపోతున్నారు. ఇక అనధికారికంగా చనిపోయే రైతుల సంఖ్య కూడా దాదాపుగా దీనికి సమానంగా ఉంటుంది. వ్యవసాయం భారంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో రైతులు రోజుకు యాభై మంది చొప్పున చనిపోవడం ఒకింత ఆందోళన కలిగించే అంశం.

Advertisement

Next Story