ఆవుకు బదులు గుర్రం.. భారత్-పాక్ ఎక్స్‌చేంజ్ ఆఫర్

by Shyam |
ఆవుకు బదులు గుర్రం.. భారత్-పాక్ ఎక్స్‌చేంజ్ ఆఫర్
X

దిశ, ఫీచర్స్ : భారత్, పాక్ సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్రమ చొరబాట్లు, పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘన వార్తల్ని నిత్యం వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తాజాగా చేసిన పని.. ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యాన్ని పెంపొందించే దిశగా ఆశలు కల్పిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలోపేతం చేయడంలో సానుకూలతను ప్రదర్శిస్తోంది.

నియంత్రణ రేఖ(LOC) వద్ద శాంతి, సామరస్యాల స్థాపనకు నిబద్ధతతో పనిచేస్తున్న సైన్యం.. భారత భూభాగంలోకి ప్రవేశించిన పశువులను పాక్‌కు అప్పగించింది. ఈ విధంగా మానవతా విలువలు ప్రదర్శించిందని ఇండియన్ ఆర్మీ ప్రకటనలో వెల్లడించింది. గత ఐదు నెలలుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తూ సైన్యం శాంతిని నెలకొల్పుతోందని చెప్పింది. కాగా ఈ జంతువులు మే నెలలో అనుకోకుండా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని బిజిల్దార్ గ్రామాన్ని దాటి, కర్నా తహసీల్‌లోని జాబ్రీ గ్రామంలోకి ప్రవేశించాయని పేర్కొంది. ప్రస్తుతం వాటిని తిరిగి అప్పగించగా, పరస్పర చర్యలో భాగంగా.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి వెళ్లిన పోనీ(గుర్రం పిల్ల)ని పాకిస్తాన్ కూడా భారత్‌కు తిరిగిచ్చేసింది. దీంతో ఈ చట్టం రెండు దేశాల ప్రజల మధ్య మెరుగైన సంబంధాల పెంపునకు ఆశాదీపంలా కనిపిస్తోందని భావిస్తున్నారు.

‘భారత్ చురుకైన విధానం, నిబద్ధతే.. ఆ జంతువులు విజయవంతంగా స్వదేశానికి చేరేలా చేశాయి. దేశంలోని మానవతా విలువలకు ఇది అద్దం పడుతోంది. కర్నా, ఉరి తహసీల్‌ పరిధిలోని పౌర పరిపాలన అధికారుల సమక్షంలో వాటిని స్వదేశానికి అప్పగించే కార్యక్రమం నిర్వహించబడింది. తమ జంతువులను తిరిగిచ్చిన భారతదేశ మానవతా చర్యను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బిజిల్దార్ గ్రామ ప్రజలు ప్రశంసించారు’ అని ఆర్మీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed