ప్రభుత్వ ఆస్పత్రులపై జూడాల సమ్మె ప్రభావం

by Anukaran |   ( Updated:2021-05-26 07:17:49.0  )
junior doctors
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్, బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్న తరుణంలో జూనియర్ డాక్టర్లు సమ్మె ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ వైపు రోగుల సంఖ్యకు తగ్గట్లుగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులు పడరాని పాట్లు పడుతుండగా మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మె గోరు చుట్టూ రోకటి పోటులా మారింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల జబ్బులకు వైద్య సేవలు అందిస్తుండగా గత యేడాది కాలంగా కొవిడ్ మహమ్మారి కూడా తోడైంది. దీనిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తింపు పొందిన వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతుండగా సుమారు 15 రోజుల నుండి బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండడం అందరినీ కలవర పరుస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, కోఠి ఈఎన్టీ, నిలోఫర్, నిమ్స్ వంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో పీజీలు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులకు హాజరైతేనే అంతంత మాత్రంగా రోగులకు వైద్య సేవలు అందుతుండగా జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు విధులు తమ డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించడంతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

వైద్య సేవలందించడంలో జూడాలే కీలకం…

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ, సరోజినీ వంటి బోధనాస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో కీలక భూమిక జూనియర్ డాక్టర్లదే. హాస్పిటల్‌లో 24
గంటలు షిప్టులవారీగా విధులు నిర్వహిస్తూ ఇన్‌పేషెంట్లకు వైద్యం అందిస్తారు. అత్యవసర వైద్యం నిమిత్తం వచ్చే రోగులకు క్యాజువాలిటీలో వైద్య సేవలు అందించేది కూడా వీరే. రోగి పరిస్థితి మరీ విషమంగా ఉంటేనే సీనియర్ వైద్యులకు (ప్రొఫెసర్లకు) చూపిస్తారు. సాధారణ రోగులకు జూడాలే వైద్యం చేస్తారు. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు కూడా వైద్య పరీక్షల నిర్వహణ, వైద్య సేవల విషయంలో వైద్యులకు జూనియర్ డాక్టర్లు సహాయ సహకారాలు అందిస్తారు. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోకంటే బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగ్గా ఉండటానికి జూనియర్ డాక్టర్లు ఉండటమే ప్రధాన కారణమన్నది ఎవరూ కాదనలేని నిజం .

రోగులకు తప్పని ఇబ్బందులు…

జూడాలు అత్యవసర సేవలను మినహాయించి విధులను బుధవారం బహిష్కరించడంతో గ్రేటర్ పరిధిలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సరోజినీ వంటి ప్రభుత్వ బోధనాసుపత్రులలో రోగులు పడరాని పాట్లు పడ్డారు. చాలా చోట్ల ఆస్పత్రులకు వచ్చిన రోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. గాంధీ ఆస్పత్రిలో ఎలక్టివ్ తో పాటు ఎమర్జెన్సీ సేవలు కూడా బహిష్కరించడంతో రోగులు తీవ్ర ఇబ్బందుల గురయ్యారు.

జూడాల సమ్మె ప్రభావం ఇక్కడ కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న రోగులకు అందించే వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా వెంటిలేటర్ పై ఉన్న రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికే అంతంత మాత్రంగా వైద్య సేవలు అందుతుండగా జూడాలు సమ్మె బాట పట్టడంతో వైద్య సేవలు మరింత సంక్లిష్టమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.

కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. ఉస్మానియా ఆస్పత్రిలో కూడా జూడాలు, రెసిడెంట్ డాక్టర్లు అత్యవసం మినహా ఇతర విధులకు హాజరు కాకపోవడంతో దీని ప్రభావం ఓపీ, ఐపీ సేవలపై పడింది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. గురువారం నుండి అత్యవసర వైద్య సేవలు కూడా బహిష్కరిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. అయితే దీనిని అధిగమించేందుకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు .

అత్యవసర సేవలు కూడా …

తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని 25వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ నెల 10వ తేదీన డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది. రెండు వారాల ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో బుధవారం అత్యవసరం మినహా ఇతర అన్ని విధులు బహిష్కరించారు. గురువారం నుండి అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.

Advertisement

Next Story