బీసీ ఆత్మగౌర‌వ భ‌వనాల‌కు త‌క్షణ‌మే టెండ‌ర్లు

by Shyam |
BC self-esteem buildings
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ ఆత్మగౌర‌వ భ‌వ‌నాల నిర్మాణాలకు త‌క్షణ‌మే టెండర్లు పిలిచి పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖైరతాబాద్‌లోని త‌న కార్యాల‌యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో క‌లిసి ఉన్నత స్థాయి స‌మీక్షా సమావేశం నిర్వహించారు. హైద‌రాబాద్లోని కోకాపేట్లో, ఉప్పల్ భ‌గాయ‌త్లోని బీసీ ఆత్మగౌర‌వ భ‌వ‌నాల‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాలు బీసీసంక్షేమ శాఖకు స్వాధీన‌ం చేశారని, ఈ నేప‌థ్యంలో బీసీల్లోని ఉప‌కులాల‌కు ఆత్మగౌర‌వ భ‌వ‌న నిర్మాణాల‌ను త్వరిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. నాణ్యత‌తో శాశ్వత భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు టెండ‌ర్లను త‌క్షణ‌మే ఆహ్వానించాలన్నారు.

ఇప్పటికే కోకాపేట్లో హెచ్ఎండీఏ మౌలిక వ‌స‌తుల్ని డెవల‌ప్ చేసింద‌ని, ఉప్పల్ భగాయ‌త్లో సైతం వ‌స‌తులు కల్పించాలని మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్యద‌ర్శి అర‌వింద్ కుమార్ ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమం కోసం క‌ట్టుబ‌డి ఉన్నార‌ని, ఎన్ని నిధులైన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి బీసీకి ప్రయోజ‌నం చేకూర్చేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. త్వర‌లోనే ఈ స‌మ‌గ్ర ప్రణాళిక‌ల‌తో సీఎం కేసీఆర్ ను క‌లుస్తామ‌ని వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప‌రిధిలోని అన్ని కార్పొరేష‌న్లలో అమ‌ల‌వుతున్న ఆర్థిక స‌హాయ , ప‌థ‌కాలు, ఇత‌ర ప‌థ‌కాల గురించి మంత్రి గంగుల స‌మ‌గ్రంగా స‌మీక్షించారు. ర‌జ‌కులు, నాయీ బ్రాహ్మణుల‌కు 250 యూనిట్ల ఉచిత క‌రెంటుతో పాటు, బీసీ నిరుద్యోగ యువ‌కుల కోసం రూ.25 ల‌క్షల వ్యయంతో ఇవ్వత‌ల‌పెట్టిన అంబులెన్స్ ల ప‌థ‌కం, ఇత‌ర ప‌థ‌కాల‌పై చ‌ర్చించారు.

గౌడ్స్‌కు మోపెడ్లు అందించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

గౌడ కార్మికుల‌కు మోపెడ్లు అందించాలని, గౌడ సొసైటీల్లోని అర్హులైన ప్రతీ ఒక్కరికి సాయం చేయాల‌ని మంత్రి గంగులను ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి గంగుల గౌడ్స్‌కు మోపెడ్లు అందించ‌డంతో పాటు పూస‌ల‌, మేద‌ర కుల‌స్తులకు అందిస్తున్న పూస‌ల బండ్ల ప‌థ‌కం అమలు చేయాలని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యద‌ర్శి బుర్రా వెంక‌టేశం, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed