ఈ ఏడాది భారత ఆర్థికవ్యవస్థకు తిరుగులేదు

by Harish |   ( Updated:2021-04-06 09:18:29.0  )
ఈ ఏడాది భారత ఆర్థికవ్యవస్థకు తిరుగులేదు
X

దిశ, వెబ్‌డెస్క్: వేగవంతంగా కొనసాగుతున్న కరోనా టీకా పంపిణీ, ప్రభుత్వ వ్యయం పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాను 12.5 శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ వృద్ధి అంచనాను 11.5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. తాజా సవరణతో కరోనా సమయంలో సానుకూల వృద్ధిని నమోదు చేసిన చైనా కంటే అధికం కావడం విశేషం. ఐఎంఎఫ్ మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో ఈ అంచనాలను వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థల్లోనే అత్యధికంగా భారత జీడీపీ 12.5 శాతం వృద్ధి సాధిస్తుందని, అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.9 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసే ఏకైన దేశం భారత్‌దే అని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం..2020లో 2.3 శాతం సానుకూల వృద్ధి రేటును సాధించిన ఏకైన ప్రధాన ఆర్థికవ్యవస్థ చైనా 2021లో 8.6 శాతం, 2022లో 5.6 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. ‘మునుపటి అంచనాలతో పోలిస్తే ప్రపంచ ఆర్థికవ్యవస్థ 2021,2022లలో బలమైన రికవరీని అంచనా వేస్తున్నాం. ప్రపంచ వృద్ధి 2021లో 6 శాతం, 2022లో 4.4 శాతంగా ఉంటుందని’ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ చెప్పారు. 2020లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ 3.3 శాతం కుదించుకుపోయిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతం టీకా, వైద్యం, ఆరోగ్య సంరక్షణ వంటి మౌలిక సదుపాయాలకు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడంపై దేశాలు దృష్టి సారించాలి. ఎక్కువగా ప్రభావితమైన కుటుంబాలకు, సంస్థలకు అవసరమైన స్థాయిలో ఆర్థిక సాయాన్ని అందించాలి. ద్రవ్య విధానం సౌకర్యవంతంగా ఉండాలని’ గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు.

కొత్తగా 9.5 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి…

కరోనా మహమ్మారి కారణంగా వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్థికవ్యవస్థల్లో భారీ నష్టం ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించినట్టు, కరోనా తగ్గిపోతున్న పేదరికాన్ని తిరిగి పెంచిందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2020లో కొత్తగా 9.5 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలోకి జారిపోయారని, మునుపటి కంటే 8 కోట్ల మంది పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని ఐఎంఎఫ్ వెల్లడించింది.

Advertisement

Next Story