ఇప్పుడిది చర్చనీయాంశం

by Sridhar Babu |   ( Updated:2020-07-11 00:27:47.0  )
ఇప్పుడిది చర్చనీయాంశం
X

దిశ, పాలేరు : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్క దారి పడుతున్నాయి. కొందరు దళారులు తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి ఇతర ప్రాంతాలకు తరలించి వాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మొక్కజొన్న, ఇతర పంటల పేరుతో రశీదులు చూపిస్తూ బియ్యాన్ని రాష్ట్రం దాటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏట ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 4వేల క్వింటాళ్లకు పైగా బియ్యం పట్టుబడటం గమనార్హం.

పేదల బియ్యం పక్క దారి పడుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం దొడ్డిదారిన దళారులకు దక్కుతున్నాయి. ఈ బియ్యాన్ని చౌకగా చేజిక్కించుకుంటున్న కొందరు వాటిని రాత్రికి రాత్రే హోటళ్లు, వ్యాపార సంస్థలు, పొరుగు రాష్ట్రాలకు తరలిస్తు రూ.కోట్లు దండుకుంటున్నారు. నిఘా కరువవుతుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. కిలో బియ్యాన్ని రూ.6నుంచి రూ.8కు కొనుగోలు చేసి హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల సరుకులను మహారాష్ట్రలోని విరూర్, నాగపూర్‌ వ్యాపారులకు అక్రమంగా చెరవేస్తూ అక్కడ కిలోకు రూ.28 నుంచి రూ.35 వరకు అమ్ముతున్నారు.

కాకినాడకు రవాణా

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దొడ్డు బియ్యానికి ప్రస్తుతం డిమాండ్‌ నెలకొనడంతో అక్కడికి పాలేరు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున బియ్యం రవాణా అవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు అడపా దడపా జరిగిన తనిఖీల్లో 4,583 క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. ఈ మేరకు రూ.1.37 కోట్ల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్న అధికారులు 183 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కోదాడ మండలంలోని కోమరబండ రైస్ ఇండస్ట్రీస్‌‌కు రూ.85 లక్షల జరిమానా విధించగా, నేలకొండపల్లి మండలం మొత్తంగా ఒక్క రోజులోనే పోలీసులు, సివిల్ సప్లై దాడుల్లో 85 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి దందా ఏస్థాయిలో అర్థం చేసుకోవచ్చు.

ఇతర పంటల పేరుతో రశీదులు

కొంతమంది బ్రోకర్లు రేషన్‌ షాపుల డీలర్ల నుంచి బియ్యం సేకరించి వాటిని మొక్కజొన్న, ఇతర ఎగుమతి పంటల పేరిట రశీదులు తీసుకుని రవాణా చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం, కాకినాడ వరకే ఈ లారీలను మాట్లాడుకుంటారు. అక్కడికి చేరుకోగానే వీరికి సంబంధించిన వారు మిల్లర్‌ ద్వారా సేకరించిన వే బిల్లును డ్రైవరుకు అందిస్తారు. అక్కడి నుంచి బియ్యం లారీలానే కాకినాడ యాంకరేజీ పోర్టుకు తరలించి అక్కడ ఎగుమతిదారుకు అప్పగిస్తారు. ఆ ఎగుమతిదారులు కిలో బియ్యానికి రూ.25 చొప్పున చెల్లిస్తారు. అనంతరం ఆ బియ్యాన్ని తాను అధికారికంగా ఆర్డర్‌ పొందిన దేశానికి నౌకలో పంపిస్తారు. అనేక ఏండ్ల నుంచి ఈ తతంగం కొనసాగుతోంది. ఆఫ్రికా, శ్రీలంక, కెన్యా, ఘనా, ఈజిప్టు వంటి దేశాల‌కు ఈ బియ్యం ఎగుమ‌తవుతున్న‌ట్టు స‌మాచారం.

కాకినాడ కేంద్రంగా 15 నుంచి 20 మంది బియ్యం ఎగుమతిదారులు ఉన్నట్టు అధికారుల అంచనా. వీరు ఏజెంట్ల నుంచి కిలో బియ్యాన్ని రూ.25కు సేకరిస్తారు. వాటిని రూ.40 నుంచి 50వరకు అమ్మకాలు జరిపి విదేశాలకు రవాణా చేస్తారు. తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట (కోదాడ నియోజకవర్గం), ఖమ్మం(పాలేరు నియోజకవర్గం), ఉమ్మడి వరంగల్(మ‌రిపెడ బంగ్లా) తదితర జిల్లాల నుంచి భారీగా లారీల ద్వారా రేషన్‌ బియ్యం కాకినాడకు తరలివెళ్తోంది.

Advertisement

Next Story