- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భావి తరాలకు శాపంగా మైదానం..
దిశ, జగిత్యాల: ప్రతి విద్యార్థి కి చదువులో క్రీడలు ఒక భాగం. క్రీడలో రాణించాలంటే మైదానాలే కీలకం. ఎంతో ఉదారతతో కళాశాల, హైస్కూలు విద్యార్థుల క్రీడల కోసం విశాలమైన స్థలం అందించగా, ఇక్కడి పాలకుల అనాలోచిత నిర్ణయం వల్ల రాను రాను మైదానం క్రీడలకు పనికి రాకుండా పోతుంది. పాలకుల తొందర పాటు ఆలోచనతో విశాలమైన మైదానంలో ఉన్న శ్రీ వివేకానంద మినీ స్టేడియం రోజు రోజుకు ఇరుకుగా మారుతుందని విద్యావంతులు నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే అరకొర సౌకర్యాల మధ్య క్రీడాకారులు ఆటలను ప్రాక్టీస్ చేస్తుండగా, భవిష్యత్ తరాలకు ఇరుకుగా మారుతున్న స్టేడియం వల్ల తలెత్తె ఇబ్బందులను సీనియర్ క్రీడాకారులు కూడా ప్రజా ప్రతినిధులకు వివరించలేక పోతున్నారు. దాని వల్ల వారి ఇష్టానుసారంగా స్టేడియంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో మైదానంలో క్రీడాకారులు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో అర్థం కాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద క్రీడా మైదానం ఇండోర్ స్టేడియం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యపు నీడలో మగ్గుతూ భావి తరాలకు శాపంగా మారుతోంది. లక్షకుపైగా జనాభా కలిగిన జగిత్యాల పట్టణంలో ఉన్న అతిపెద్ద ఏకైక క్రీడా మైదానం ఇది. యువత, చిన్నారులకు క్రీడల కోసం ఇలాంటి మైదానాలు ఇక్కడ మరో చోట లేదు. ఉన్న ఏకైక మినీ స్టేడియంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న నిర్మాణాల వల్ల మైదానం రోజు రోజుకు ఇరుకుగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఒక వైపు రోడ్డు పక్కన చిరు వ్యాపారులు వేసుకున్న షెడ్ల యజమానులు, తరచూ క్రీడ మైదాన స్థలంను అక్రమిస్తూ నిర్మాణాలు చేసుకుంటున్నారు. ప్రశ్నించే గొంతుక లేకపోవడంతో చిరు వ్యాపారులకు ఆడిందే ఆటగా సాగుతోందని క్రీడా కారులు, విద్యావంతులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు.
దాత ఉదారత…
జగిత్యాల పట్టణంలో విద్యార్థులు చదువుకోవడంతో పాటు క్రీడలకు సరైన స్థలం లేకపోవడంతో 1960-70 ఈ మధ్య కాలంలో కాసుగంటి నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కళాశాలకు ఆనుకుని ఉన్న ఈ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. కళాశాలకు స్థలంతోపాటు, క్రీడా మైదానానికి స్థలం కూడా అందచేయగా దానికి ఎస్.కె.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్‌గా పిలుస్తున్నారు. ఎంతో మందిని విద్యావంతులతో పాటు క్రీడాకారులను తీర్చిదిద్ది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులుగా అందించిన ఘనత ఈ క్రీడా మైదానానికి దక్కుతుంది. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అనే చందంగా అభివృద్ధి నోచుకోకపోగా రోజు రోజుకు మైదానం ఇరుకుగా మా రడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
అభివృద్ధి కి నిధులు…
రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడాంశాల పోటీలకు నిలయంగా ఉంటూ వస్తున్న ఈ మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు అప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్.ఏ.ఏ.పి) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తదుపరి కాలంలో జగిత్యాలకు ఇండోర్ స్టేడియం మంజూరు కావడంతో ఆనాటి పాలకులు ఈ మైదానంలోనే ఇండొర్ స్టేడియం నిర్మించారు. విశాలమైన క్రీడా మైదానంలో ఇండోర్ స్టేడియం ఏదో చివరికి కాకుండా ఇండోర్ స్టేడియం మైదానంలో మధ్యలో నిర్మించడంతో మైదానంలో ఫుట్ బాల్, క్రికెట్ లాంటి క్రీడలకు మైదానంలో అవకాశం లేకుండ పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మరో పక్క బాస్కెట్ బాల్ కోర్ట్ నిర్మించారు. అది నిరుపయోగంగా ఉండగా, మరో బాస్కెట్ కోర్టు నిర్మాణానికి పూనుకొని మధ్యలోనే ఆపేశారు. 8 సంవత్సరాలు అవుతున్న దాని పూర్తి చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని కొందరు క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు.
ఊకదంపుడు ఉపన్యాసాలు..
ఏదైనా క్రీడా కార్యక్రమాలకు హాజరైనప్పుడే తప్ప క్రీడలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇక్కడి క్రీడాకారులు వాపోతున్నారు. క్రీడలకు ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పుకోవడమే తప్ప క్రీడా రంగ అభివృద్ధికి అంత పెద్దగా శ్రద్ధ చూపడం లేదని క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైన నాయకులు ఇప్పటికైనా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్న స్థలంలో రెండువైపులా రోడ్డు వేయడంతో మైదాన పరిమాణం తగ్గడమే గాక ఇదే మైదానంలో గ్రామీణ క్రీడలకు సంబంధించి పైకా భవన నిర్మాణం జరిగింది. కానీ అందులో కూడా కనీస వసతులు కరువయ్యాయి. ఆ తర్వాత ఇదే మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి గతంలో పని చేసిన జిల్లా కలెక్టర్ శరత్ బడ్జెట్ కేటాయించారు. కానీ ఈ ట్రాక్ ఒక ఫీట్ ఎత్తుగా నిర్మించడంతో మైదాన పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది.
నిరుపయోగంగా ఇండోర్ స్టేడియం
లక్షలు వెచ్చించి నిర్మించిన ఇండోర్ స్టేడియం నిరుపయోగంగా మారింది. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఎలగందుల రమణ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ కు నిధులు మంజూరు చేయించారు. పట్టణంలో ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉండగా ఈ మైదానంలోనే నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ఈ ఇండోర్ స్టేడియం అసంపూర్ణంగానే మిగిలి పోయింది. దీంతోపాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఇప్పటికి ప్రారంభానికి నోచుకోకుండా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఈ ఇండోర్ స్టేడియం జిల్లా ఏర్పాటు అయిన తర్వాత డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ గా మారింది. ప్రతి ఎలక్షన్ల్‌లో ఇండోర్ స్టేడియాన్ని ఎలక్షన్ స్టోరేజ్, స్ట్రాంగ్ రూమ్ గా వాడుకుంటున్నారు తప్ప, ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దీన్ని ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని పట్టించుకోవడం లేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు క్రీడా మైదానం క్రీడలకు కాకుండా ఎగ్జిబిషన్‌లకు, దీపావళికి బాణసంచా దుకాణాలకు అద్దెకు ఇవ్వడానికి ఉపయోగపడుతుందే తప్ప క్రీడలకు వినియోగించడం మరిచిపోయారని స్థానికుల విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి డివైఎస్ఓ గా అలీ నియమించారు. అలీ బదిలీ తరువాత ఆర్డిఓ ఇన్చార్జిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క క్రీడ అంశాలకు కోచ్ ను ఏర్పాటు చేయక పోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు జగిత్యాల మున్సిపల్ పాలకవర్గం ఇదే మైదానంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. ఇదే జరిగితే ఇక మినీ స్టేడియం కాస్త మైక్రో స్టేడియం గా మారుతుందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నోరు మెదపని నేతలు
అభివృద్ధి పేరిట జరుగుతున్న నిర్మాణాల వల్ల ఇరుకుగా మారుతున్న కళాశాల గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు నాయకులు స్పందించాలని కోరుతున్నారు. విశాలమైన మైదానంలో ఉన్న జగిత్యాల మినీ స్టేడియం పై వెంటనే నేతలు స్పందించి, ఉన్న ఒక్కగానొక్క మినీ స్టేడియంలో ఇతర నిర్మాణాలు చేపట్టకుండా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మండలాల్లో ఏవి మినీ మైదానాలు..
రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మినీ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. మండల కేంద్రాలలో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో క్రీడా మైదానం ఏర్పాటు చేయడంతోపాటు ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు, యువత కోరుతుంది.
బాస్కెట్ బాల్ క్రీడాకారుడు.. కాండ్రేవుల. శ్రీరామ్
జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో ఉన్న ఒక క్రీడా మైదానం అభివృద్ధి పేరిట జరుగుతున్న నిర్మాణాలతో రోజురోజుకు కుశించుకుపోతుంది. ఇదే మైదానంలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ ,బాస్కెట్ బాల్ కోర్ట్ నిర్మించారు. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి ప్రారంభానికి నోచుకోలేదు.
మా క్రీడాకారుల ఆశలు అడియాశలయ్యాయి. దీనికితోడు మున్సిపాలిటీ పాలకవర్గం చిరు వ్యాపారులకు షెడ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడంతో మైదానంలో కొంత స్థలం ఆక్రమించి షెడ్లు వేసుకున్నారు. దీంతో రన్నింగ్ ట్రాక్, క్రికెట్, ఫూట్ బాల్ ఆటలకు పనికిరాకుండా పోయింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి మైదానాన్ని ఆక్రమించిన షెడ్లు తొలగించి క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నామని అన్నారు. వెంటనే ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.
గుండ మధు అధ్యక్షులు.. జిల్లా యువజన కాంగ్రెస్-జగిత్యాల
జిల్లా కేంద్రంలోని ఉన్న ఒక క్రీడా మైదానం ఇతర నిర్మాణాలతో కూరుకపోయింది. గత పాలకులు 2013లో క్రీడా మైదానం అభివృద్ధి కోరకు 1కోటి 60 లక్షల నిధులు విడుదల చేశారు. దాంతో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ బాస్కెట్ బాల్ కోర్ట్‌లు నిర్మించారు. కానీ 8 సంవత్సరాలు గడుస్తున్నా, ఇండోర్ స్టేడియంలో వుడ్ ప్లోరింగ్ , బాస్కెట్ బాల్ కోర్ట్ నిర్మాణాల పనులు కూడా మధ్యలోనే ఆగడంతో క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారు. అలాగే లక్షల రూపాయలతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఏటా వచ్చే మున్సిపాలిటీ నిధుల నుండి 50 లక్షలు నిధులు కేటాయిస్తే ఇండోర్ స్టేడియం పూర్తయితే క్రీడాకారుల కల నెరవేరుతుంది.