- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రియల్’ దందా.. చక్రం తిప్పుతున్న TRS నేత.. ముడుపులిస్తే అంతా ఓకే..
దిశ, నిఘా ప్రతినిధి : అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం నిబంధనలు పాటించకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. అనుమతుల కోసం అప్లై చేసుకోవడం, అవి రాకముందే అన్నీ ఉన్నాయంటూ అమాయకులను మోసం చేయడం.. తెలిసీ తెలియక కొన్నవారు ఇబ్బందుల్లో పడడం.. ఇదీ కొన్ని వెంచర్లలో జరుగుతున్న అక్రమ తంతు. ఇలాంటి మోసపూరిత వెంచర్లపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నా రియల్ వ్యాపారులు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే ఖమ్మం నగరం రోజురోజుకూ విస్తరిస్తుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పలు పార్టీల కీలక నాయకులు సైతం రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్లు విక్రయిస్తూ అడ్డదారిన రిజిస్ట్రేషన్లు సైతం చేయిస్తున్నారు. అక్రమ లే ఔట్లు.. అనుమతులు లేనే లేవు.. మరి రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయనుకుంటున్నారా..? అసలు కథ అక్కడే ఉంది.
ముడుపులు ముడితే ఓకే..
ఖమ్మం నగరంతో పాటు కొంత పరిధిలో కీలక హోదాలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు స్వయంగా ఈ అక్రమ వెంచర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంతో పాటు ఆ పరిధిలో వెలుస్తున్న వెంచర్లకు ఆ నాయకుడికి ముడుపులు అందితే ఎలాంటి అనుమతులూ అవసరం లేదన్నమాట. నిబంధనలు పాటించనవసరం లేదు. అంతేకాదు.. అనుమతులు లేని వెంచర్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దన్న ప్రభుత్వ నిబంధనలను సదరు నాయకుడు పట్టించుకోడు. రియల్ వ్యాపారులతో డీల్ కుదిరితే చాలు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా దగ్గరుండి మరీ చేయిస్తారనే టాక్ వినిపిస్తోంది. తన పలుకుబడిని ఉపయోగించి అధికారులను సైతం మేనేజ్ చేస్తుంటాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికీ ఎక్కడా అనుమానం రాకుండా అధికారులతోనే రిజిస్ట్రేషన్లు అడ్డదారిలో చేయిస్తున్నట్లు సమాచారం.
డీల్ కుదరకుంటే పెండింగే..
ఇప్పటికే ఖమ్మం నగరంతో పాటు కొంత పరిధిలో లెక్కకు మించి వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిలో దాదాపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవే చాలా ఉన్నాయి. అంతేకాదు.. పర్మిషన్ కావాలంటే నిబంధనల ప్రకారం వెళ్తే సమయం ఎక్కువ పడుతుండటంతో కొందరు లే అవుట్లు లేకుండానే పర్మిషన్లకు వెళ్తున్నారు. అలాంటి వారందరూ మొదట ఈ నాయకుడి దగ్గరకే వెళ్లాల్సి ఉంటుంది. అయితే అడిగినంత ఇవ్వకుంటే ఆ వెంచర్ పనులన్నీ పెండింగ్‌లో పడ్డట్టే.. పర్మిషన్ రాదు.. పనులు చేసుకోనివ్వరు.. అక్రమమంటూ రకరకాలుగా వేధిస్తారు.. అందుకే డీల్ కుదిరినాకే ఎక్కువగా రియల్ వ్యాపారులు వెంచర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే దాదాపు అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన వెంచర్లే అధికంగా ఉన్నట్లు సమాచారం.
సుమారు 14 ఎకరాల్లో..
ఖమ్మం నగరంలోని ప్రకాశ్ నగర్, ముదిగొండ రోడ్డున 251, 252, 253, 254, 255, 256 సర్వే నంబర్లలో సుమారు 14 ఎకరాల్లో లే అవుట్ లేకుండానే వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లకు ఎలాంటి అనుమతులు కూడా లేనట్లు సమాచారం. ఎనిమిది ఎకరాల చొప్పున వెలిసిన ఈ రెండు వెంచర్లలో దాదాపు సగానికి పైగా ప్లాట్లను ఇప్పటికే అమ్మేశారు. కాగా కొన్నింటికి అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ వెంచర్లు అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇద్దరూ కలిసి వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా అసలు అనుమతులు లేని వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు సైతం చేస్తుండటమే అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన సదరు నేత తన పలుకుబడిని ఉపయోగించి నిబంధనలకు విరుద్ధంగా అధికారులతో తమ పనిచేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మున్నేరు ఆక్రమణ..
అయితే ఈ వెంచర్ల పక్కనే మున్నేరు ఉండడంతో.. చెరువు శిఖాన్ని కూడా కొంత వరకు ఆక్రమించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన సదరు నాయకుడు చక్రం తిప్పుతుండడంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
రియల్ వ్యాపారంలో ఇటీవల అక్రమాలు తీవ్రస్థాయిలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అక్రమ లే అవుట్లు, వెంచర్లపై కొంత కాలంగా కొరడా ఝులిపిస్తూనే ఉంది. నిబంధనలు ఎప్పటికప్పుడు కఠిన తరం చేస్తూ వస్తోంది. అనుమతులు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాటికి రిజిస్ట్రేషన్ చేయరాదంటూ స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది. అయినా ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఖమ్మం-1 రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రకాశ్ నగర్ లో వెలిసిన రెండు వెంచర్లకు సైతం అధికార పార్టీకి చెందిన నాయకుడు తమ పలుకుబడిని ఉపయోగించి పూర్తిగా అడ్డదారిలో రిజిస్ట్రేషన్ తంతు కానిచ్చినట్లు తెలుస్తోంది.
వాళ్ల పేరు ఎక్కడా వినిపించదు..
అయితే ఆ రెండు వెంచర్లు అధికార పార్టీలోని ఓ కీలక నేతతో పాటు ఎర్ర పార్టీకి చెందిన ఓ నాయకుడు ఉన్నట్లు పక్కా సమాచారం. అయితే వారిద్దరూ ఎక్కడా కనిపించరూ.. వారి పేర్లు ఎక్కడా వినిపించవు. ప్లాట్ల అమ్మకాలు.. రిజిస్ట్రేషన్ తంతు.. భూమి పట్టాలు.. ఇవ్వన్నీ వారి బంధువులు, బినామీల పేర్ల మీదే ఉంటాయి. అయినా ఈ రియల్ దందాలో మాత్రం ఆ ఇద్దరే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భవిష్యత్‌లో ఇబ్బందులే..
అక్రమాలను అడ్డుకోవాల్సిన సదరు అధికార పార్టీకి చెందిన నేతనే నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేసి అధికారులతో అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే 50 శాతం నుంచి 60శాతం వరకు పాట్లను విక్రయించగా.. కొన్నింటికి అడ్వాన్సులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అక్రమ లే అవుట్లపై ప్రభుత్వం నిబంధనలు కఠిన తరం చేస్తున్న నేపథ్యంలో అక్రమ వెంచర్లలో ఇప్పుడు ప్లాట్లు కొన్నవారు భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినందుకు అధికారులకు సైతం భారీగానే ముడుపులు ముట్టచెబుతున్నట్లు చర్చ జరుగుతోంది.
ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు..
లే అవుట్ లేకుండా రిజిస్ట్రేషన్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రకాశ్ నగర్ వెంచర్ల గురించి మా దృష్టికి కూడా వచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు రిజిస్ర్టేషన్లు చేయొద్దని లెటర్ కూడా పెట్టాం. ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మా సూపర్ వైజర్ సైట్ వద్దకు వెళ్లి రిపోర్టు సైతం ఇచ్చాడు. రిజిస్ట్రేషన్లు చేయొద్దని మళ్లీ లెటర్ పెడతాం. చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాం.
– సాయి, టౌన్ ప్లానింగ్ అధికారి