రైతులను స్టార్ హోటల్స్‌కి తీసుకెళ్లి.. వంటకాల రుచి చూపించి నిలువునా మోసం చేశారు

by Shyam |   ( Updated:2021-11-11 20:54:20.0  )
Star-Hotels1
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​కు తూర్పున సరికొత్త భూదందా కొనసాగుతున్నది. 15 ఏండ్ల క్రితం బడా కంపెనీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశాయి. కారణాలేవైనా రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేసుకోలేదు. దాంతో వారికి విక్రయించిన రైతుల పేర్ల మీదనే రెవెన్యూ రికార్డుల్లో ఉండిపోయాయి. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంలోనూ మార్పులు చేయలేదు. దీంతో రికార్డుల్లోనూ పాత రైతులకే హక్కులు కట్టబెట్టారు. ఇప్పుడవే భూములను కొందరు దళారులు మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. తక్కువ ధరకే వస్తుండడం, రెవెన్యూ శాఖ క్లియరెన్స్ ఇస్తుండడంతో సంపన్నవర్గాలు పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఈ అక్రమ దందా జోరుగా సాగుతోంది. నిజానికి ధరణి పోర్టల్ డేటా, సాంకేతిక దన్ను ఆధారంగా యథేచ్ఛగా ఈ దందా సాగుతున్నది.

అసలేం జరిగింది?

2004 నుంచి 2008 వరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. పల్లెల్లోని పడావులకు డిమాండ్​వచ్చింది. అదే క్రమంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం, మంచాల, యాచారం, నల్లగొండ జిల్లా మర్రిగూడ, యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలాల్లో వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్నది స్థానికులందరికీ తెలుసు. ఆయన ఆ భూములను బడా సంస్థలకు కట్టబెట్టేందుకేనన్న వాస్తవం నేటికీ ప్రచారంలో ఉంది. వందలాది సేల్ డీడ్స్ కూడా కొన్ని కంపెనీల పేరిట ఉన్నాయి. అయితే అవి రియల్ ఎస్టేట్ సంస్థలు కావు. కొన్ని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, ఇంకొన్ని లిమిటెడ్ కంపెనీలు, మరికొన్ని సంస్థలు ఎందుకోసం పని చేస్తాయో అంతుచిక్కవు. దేవరకొండ, చౌటుప్పల్, చండూరు, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వందలాది ఎకరాల భూమికి సంబంధించిన సేల్ డీడ్స్ జరిగాయి. ఇప్పటికీ ఆ సర్వే నెంబర్లపై ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు(ఈసీ) తీసుకుంటే ఏయే కంపెనీ ఎంతేసి కొనుగోలు చేశాయో తెలుస్తుంది. అప్పట్లో సదరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి మందీమార్బలంతో కార్లతో వస్తే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రైతులతో బేరసారాలు కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని స్టార్ హోటళ్లల్లో సాగాయన్న ప్రచారం కూడా ఉంది. ఏనాడూ స్టార్ హోటళ్లకు వెళ్లని రైతులకు అక్కడి వంటకాల రుచి చూపించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించారని సమాచారం. అందులో చాలా వరకు గుట్టలు, కొండలే కావడం.. పైగా వాటిని చూసుకొని మురిసిపోవడం తప్ప ఎందుకూ పనికి రావని మాటల్లో పెట్టి ఎకరా రూ.10 వేల నుంచి మొదలై రూ.లక్ష వరకు కొనుగోలు చేశారని సమాచారం. ఆ గుట్టల చుట్టూ ఉన్న సాగు భూములనూ అదే రేట్లకు కొనుగోలు చేశారు. సదరు కాంగ్రెస్ నేత ద్వారా వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన కంపెనీలు ఆ భూముల వైపు కన్నెత్తి చూడలేదు.

ఇందులో హైదరాబాద్, బెంగుళూరు కేంద్రంగా నడిచే పలు కంపెనీలు సేల్ డీడ్స్ ను బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోట్లల్లో రుణాలు పొందారని తెలుస్తున్నది. ఓ బడా కంపెనీపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, సదరు కంపెనీ యాజమాన్యం కేసుల్లో ఇరుక్కోవడంతో మిగతా కంపెనీలు రెవెన్యూలో మ్యూటేషన్​ చేయించుకోలేదు. భూ యాజమాన్య హక్కులు పాత రైతులకే ఉన్నాయి. ఈ క్రమంలో 2017 భూ రికార్డుల ప్రక్షాళనలోనూ వారికే 1 బి ఫారాలు అందాయి. ఇదే అదనుగా రెవెన్యూ అధికారులు డిజిటల్ పాసుపుస్తకాలు మంజూరు చేసేందుకు భారీగానే డబ్బులు లాగారని సమాచారం. ధరణి పోర్టల్​లోనూ రైతుల పేర్లే ఉండటంతో రైతుబంధు, బీమా అన్నీ వర్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ తర్వాత పెరిగిన ఫాంహౌజ్ కల్చర్ పెరిగింది. రియల్టర్లు సదరు భూములను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఇదే ప్రాంతంలో ఉమ్మడి రాష్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత కుమారుడు, బంధువులు అంతకు ముందే 150 ఎకరాలు కొనుగులో చేశారని ప్రచారంలో ఉన్నది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు కూడా రియల్టర్ల అవతారం ఎత్తారు. బడా కంపెనీలు కొనుగోలు చేసిన భూములు రైతుల పేరిటే ఉండటంతో తక్కువ ధరకే అమ్మిస్తున్నారు. తక్కువ ధరకే లభిస్తాయని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అంతా తమదే బాధ్యత అంటూ బురిడీ కొట్టిస్తున్నారు.

అక్రమార్కులకు వరం ‘ధరణి’

రాష్ట్రంలో మ్యూటేషన్లకు నోచుకోని డాక్యుమెంట్లు వేలల్లోనే ఉన్నాయి. దీంతో మరోసారి అమ్మేందుకు అవకాశం ఏర్పడుతున్నది. ఇందుకు ధరణి పోర్టల్​లోని లోపాలు సపోర్టు చేస్తుండటం గమనార్హం. సేల్ డీడ్ ద్వారా విక్రయించినా ఆ విషయాన్ని పసిగట్టే వ్యవస్థ ఆ పోర్టల్ కు లేదు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో బడాబాబులు, వారి కంపెనీల పేరిట కొనుగోలు చేసిన భూముల క్రయ విక్రయాలన్నీ సేల్ డీడ్స్ లో మిగిలాయి. ధరణి పోర్టల్ లో స్లాట్ బుక్ అయ్యిందంటే తిరస్కరించే అధికారం తహశీల్దార్లకు లేదు. అదే ఇరుపక్షాలకు వరంగా మారింది. గతంలో విక్రయించిన భూములకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తే ధరణి పోర్టల్ ప్రకారమే చేశాం.. అంటూ చేతులుదులుపుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed