డ్రైనేజీ పైపు ద్వారా భార‌త్‌లోకి చొర‌బ‌డ్డ బంగ్లాదేశీయులు.. ఏపీలో కలకలం

by srinivas |   ( Updated:2021-07-03 05:50:32.0  )
Illegal Immigration
X

దిశ, ఏపీ బ్యూరో: బీహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో జూన్ 17న జరిగిన పేలుడు నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రైళ్లలో త‌నిఖీలు నిర్వహిస్తోంది. మరోవైపు ఏపీ పోలీసులు సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పాస్ పోర్టు లేకుండా భార‌త్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ యువ‌కుల‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో న‌లుగురిని రాజ‌మ‌హేంద్రవ‌రంలో అరెస్టు చేయ‌గా, మ‌రో న‌లుగురిని విజ‌య‌వాడ‌లో అరెస్ట్ చేశారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి ప‌శ్చిమ బెంగాల్ హావ్రాలోకి, అక్కడి నుంచి రైళ్లలో ప‌లు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. వారంతా కొన్నేళ్ల క్రిత‌మే పాస్‌పోర్టు లేకుండా డ్రైనేజీ పైపు ద్వారా భార‌త్‌లోకి చొర‌బ‌డ్డార‌ని పోలీసులు గుర్తించారు.

వారి వ‌ద్ద అధికారిక ప‌త్రాలు లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఎనిమిది మంది బెంగ‌ళూరు చిరుమానాతో న‌కిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డు, ఓట‌ర్ కార్డుల‌తో భార‌త్‌లో తిరుగుతున్నార‌ని పోలీసులు నిర్ధారించారు. 2017-2019 మ‌ధ్య వారంతా గోవాలో ఉన్నట్లు గుర్తించారు. భార‌త్‌లో కొవిడ్ నేప‌థ్యంలో 2019లో బంగ్లాదేశ్‌కు వెళ్లి.. నెల క్రిత‌మే మ‌ళ్లీ గోవాకు వ‌చ్చి, భార‌త్‌లోని ప‌లు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అయితే తాము ఉపాధి కోసం వచ్చినట్లు పోలీసులకు పట్టుబడ్డ 8 మంది చెప్తున్నారు. పోలీసులు మాత్రం వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story