చంద్రుని మీద ఇంటి కోసం అంతరిక్ష ఇటుక

by Shyam |
చంద్రుని మీద ఇంటి కోసం అంతరిక్ష ఇటుక
X

దిశ, వెబ్‌డెస్క్:
పెరుగుతున్న కాలుష్యం, వనరుల అతివినియోగం కారణంగా భూమి రోజురోజుకీ జీవించడానికి వీలు లేకుండా పోతోంది. దీంతో అంతరిక్షంలో అంటే చంద్రుడు, అంగారకుడు వంటి ఉపగ్రహగ్రహాల మీద నివాసాలు ఏర్పరచగలిగే సాంకేతికతను పరిశోధకులు రూపొందిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అంతరిక్ష ఇటుకను తయారు చేశారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇస్రో సంస్థలు సంయుక్తంగా ఈ అంతరిక్ష ఇటుకను తయారు చేశారు. భవిష్యత్తులో భూమ్మీద పర్యావరణ సహిత నివాసాలు ఏర్పరుచుకోవడానికి కూడా ఈ ఇటుక ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

బయోమినరలైజేషన్ అనే విధానం ద్వారా ఈ ఇటుకను తయారు చేసినట్లు ప్రొఫెసర్ అలోక్ కుమార్ తెలిపారు. బయోమినరలైజేషన్ అనేది ఎప్పట్నుంచో భూమ్మీద జరుగుతున్న పద్ధతి. సముద్రంలోపల ఆల్చిప్పలు గట్టిగా, తేలికగా ఉండటానికి కారణం అవి బయోమినరలైజేషన్ పద్ధతిలో ఏర్పడటమే. ఇదే పద్ధతి ద్వారా తయారు చేసిన ఈ అంతరిక్ష ఇటుకలు కూడా గట్టిగా తేలికగా ఉంటాయని అలోక్ కుమార్ చెప్పారు. ముందుగా ఇస్రో పరిశోధకులు లూనార్ సాయిల్ సిమ్యులంట్ అనే ప్రత్యేకమైన మట్టిని తయారుచేశారు. ఇది రసాయనిక సమ్మేళనంలో దాదాపు చంద్రుని మీద దొరికే మట్టితో 99 శాతం సరిపోలింది. ఈ మట్టికి స్పోరోసార్చిన పాశ్చరీ అనే బ్యాక్టీరియా కలిపి బయోసిమెంటేషన్ ద్వారా గట్టి పడేలా చేసి ఇటుకను తయారుచేశారు.

Advertisement

Next Story