‘డోసుల మధ్య మూడు నెలల తేడా ఉంటే 90శాతం ఎఫెక్టివ్’

by vinod kumar |
‘డోసుల మధ్య మూడు నెలల తేడా ఉంటే 90శాతం ఎఫెక్టివ్’
X

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ టీకా తొలి డోసు తర్వాత రెండో డోసును రెండున్నర నుంచి మూడు నెలల వ్యవధితో తీసుకుంటే వ్యాక్సిన్ సామర్థ్యం 90శాతానికి పెరిగే అవకాశముందని సీరం ఇన్‌స్టిట్యూ్ట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒక నెల తేడాతో రెండు డోసులను తీసుకున్న ప్రయోగంలో టీకా సామర్థ్యం 60 నుంచి 70శాతంగా ఉన్నట్టు తేలిందని, దీనికి సమాంతరంగానే మరో ప్రయోగం కూడా చేశారని పూనావాలా అన్నారు. రెండు నుంచి మూడు నెలల తేడాతో రెండో డోసు తీసుకున్నప్పుడు టీకా సామర్థ్యం 90శాతం కనిపించిందని వివరించారు. రెండు డోసుల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా ఇతర టీకాలను పరిశీలించినా ఫలితాలు మెరుగ్గానే కనిపిస్తాయని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ఇటీవలే రెండు డోసుల మధ్య కాలాన్ని గరిష్టంగా ఎనిమిది వారాలకు పెంచిన సంగతి తెలిసిందే. ఒక నెల వ్యవధి తేడాతో రెండు డోసులను తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్ టీకా 70శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనాపత్రిక ది లాన్సెట్ ఇటీవలే పేర్కొంది.

70శాతం మందికి ఒక్క డోసుతోనూ సంపూర్ణ రక్షణ

50ఏళ్ల లోపువారిలో తొలి డోసు తీసుకున్నాక నెల రోజుల్లోనే టీకా అధ్భుతమైన రక్షణనిస్తున్నదని పూనావాలా వివరించారు. రికవరీ అయిన కరోనా పేషెంట్‌లో కన్నా ఎక్కువ ప్రొటెక్షన్ కనిపిస్తున్నదని తెలిపారు. దాదాపు 70శాతం మందిలో సింగిల్ డోసుతోనూ సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని అన్నారు. కానీ, దీర్ఘకాలిక రక్షణ కోసం రెండో డోసు తప్పనిసరి అని వివరించారు. రెండో డోసు తీసుకున్న తర్వాతా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను తప్పకుండా పాటించాలని, కరోనాకు మందు వచ్చే వరకు లేదా కొద్దిమొత్తంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు వీటిని అనుసరించడం ఉత్తమమని అన్నారు.

Advertisement

Next Story