ప్యాకేజీ డిమాండ్‌ను సృష్టించలేదు : ఇక్రా

by Harish |
ప్యాకేజీ డిమాండ్‌ను సృష్టించలేదు : ఇక్రా
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా(ఐసీఆర్ఏ) భారత వృద్ధి రేటును 2020-21 ఆర్థిక సంవత్సరానికి 5 శాతం తగ్గించి 1 నుంచి 2 శాతానికి పరిమితం చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు మైనస్ 25 శాతం, మైనస్ 2.1 శాతం ఉండనున్నట్టు అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 16 శాతం నుండి 20 శాతం తగ్గుదల ఉంటే, రెండో త్రైమాసికంలో 2.1 శాతం వృద్ధి ఉంటుందని ఇంతకుముందు అంచనా వేసింది. అయితే, పరిస్థితులను అనుసరించి ఇప్పుడు మళ్లీ దీన్ని సవరించింది.

లాక్‌డౌన్ పొడిగింపు, కార్మికుల పనులకు అందుబాటులో లేకపోవడం లాంటి పలు కారణాలతో సరఫరా వ్యవస్థ బలహీనమవుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై ఇక్రా స్పందించింది. జీడీపీలో 10 శాతం అని చెబుతున్న ఈ ప్యాకేజీ.. కరోనా సంక్షోభం వల్ల క్షీణించిన డిమాండ్‌ని కాపాడలేకపోవచ్చని తెలిపింది. వాస్తవానికి ఈ ప్యాకేజీ జీడీపీలో 1 శాతం నుంచి 2 శాతమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక ప్యాకేజీలో తక్షణం అందించాల్సిన ఉపశమన చర్యలను కాకుండా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పలు రంగాలకు ఊతమిచ్చే విధంగా చర్యలు ఉన్నాయని ఇక్రా అభిప్రాయపడింది. ఇప్పటికే రెండు నెలలుగా జరిగిన నష్టాలకు సంబంధించిన ఊరట లేదని పేర్కొంది.

ఈ ప్యాకేజీలో ఎన్నో సంస్కరణలు ప్రకటించారని, అయితే ఇది తక్షణ ఊరటను ఇవ్వలేదని ఇక్రా అభిప్రాయపడింది. మొదటి దశ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే V షేప్ రికవరీ ఉంటుందని అంచనా వేశామని, కానీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు W షేప్ రికవరీ ఉంటుందని, భారత్ సహా ప్రపంచం భారీ సంక్షోభంలోకి వెళ్తోందని ఇక్రా హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed