IND vs PAK : మహా సమరానికి వేళాయే.. నేడు భారత్, పాక్ పోరు

by Harish |   ( Updated:2024-06-08 19:52:22.0  )
IND vs PAK : మహా సమరానికి వేళాయే.. నేడు భారత్, పాక్ పోరు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ మొదలై వారం రోజులైంది. అభిమానులు ప్రపంచకప్‌ను ఆస్వాదిస్తున్నారు. కానీ, ధ్యాసంతా ఆ మ్యాచ్‌పైనా.. ప్రతి రోజూ ఏదో ఒక సందర్భంలో ఆ పోరు గురించే చర్చ. అసలైన కిక్కే ఇచ్చే ఆ మ్యాచ్ కోసమే ఎదురుచూపులు. ఆ మ్యాచే భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఆ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నేడే భారత్, పాకిస్తాన్ పోరు. మరి, టీమ్ ఇండియా పాకిస్తాన్‌పై తన ఆధిపత్యా్న్ని కొనసాగించేనా?..

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై నెగ్గి శుభారంభం చేసిన రోహిత్ సేన ఆదివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూపు ఏలో పాక్‌ మినహా భారత్‌కు పెద్ద పోటీ లేదు. సూపర్-8కు చేరుకోవడం ఖాయమే. కానీ, పాక్‌పై గెలిస్తే గ్రూపు దశను అగ్రస్థానంతో ముగించొచ్చు. కొంతకాలంగా పాకిస్తాన్ తడబాటును పరిశీలిస్తే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా భారత్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. కానీ, బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బలమైన బౌలింగ్ దళం ఉన్న పాక్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్ని విభాగాల్లో రాణించాల్సిన అవసరం ఉన్నది.

అక్షర్ డౌటే?

పాక్‌తో మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఐర్లాండ్‌పై రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన విరాట్ నిరాశపర్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ వారిద్దరే ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, జైశ్వాల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. 3వ స్థానంలో పంత్, ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, జడేజా బ్యాటింగ్‌కు రానున్నారు. పేస్ దళంలో బుమ్రా, పాండ్యా, సిరాజ్, అర్ష్‌దీప్ ఖాయమే. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కావొచ్చు.

బౌలర్లు ఏం చేస్తారో?

నసావు కౌంటీ పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను ఎంత వరకు కట్టడి చేస్తారనేదే దానిపైనే టీమ్ ఇండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఐపీఎల్‌లో నిరాశపర్చిన పాండ్యా జాతీయ జట్టుకు వచ్చేసరికి అతను రెచ్చిపోతున్నాడు. ఐర్లాండ్‌పై మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌‌దీప్, సిరాజ్ కూడా టచ్‌లోనే ఉన్నారు. బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని నుంచి పాక్ బ్యాటర్లకు ముప్పు తప్పదు.

పాక్‌లో వీళ్లతో జాగ్రత్త

కొంతకాలంగా పాక్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇటీవల అమెరికా చేతిలో ఆ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. సొంత మాజీ క్రికెటర్లే ఆ జట్టు ప్రదర్శనపై విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్ బాబర్, రిజ్వాన్‌లలో మునపటి దూకుడు కనిపించడం లేదు. నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు. అయినా, వాళ్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగే, ఫకర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్‌లు తమదైన రోజున రెచ్చిపోయేవాళ్లే. ముఖ్యంగా భారత్‌కు పాక్ బౌలింగ్‌తో ముప్పు ఉంది. షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమిర్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.

పిచ్ బౌలర్లదే

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ పిచ్‌పై బౌలర్లదే హవా అని గత మ్యాచ్‌లు చూస్తే అర్థమవుతుంది. పిచ్ పేసర్లకు అనుకూలించనుంది. అనూహ్య బౌన్స్, స్వింగ్ బ్యాటర్లకు సవాల్ విసరనుంది. ఇక్కడ 100 పరుగులు చేయడానికే బ్యాటర్లకు కష్టాలు తప్పడం లేదు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.

భారత్‌దే ఆధిపత్యం

టీ20ల్లో పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. ఇరు జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. అందులో ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. పాక్ మూడు సార్లు నెగ్గగా.. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చివరిసారిగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మ్యాచ్‌లో టీమ్ ఇండియానే నెగ్గింది.

తుది జట్లు(అంచనా)

భారత్ : రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబె, పాండ్యా, జడేజా, కుల్దీప్/అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్

పాకిస్తాన్ : రిజ్వాన్, బాబర్ ఆజామ్(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, మహ్మద్ అమిర్, నసీమ్ షా.

Advertisement

Next Story

Most Viewed