T20 World Cup: పాట్ కమిన్స్ సంచలన రికార్డు.. వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్

by Ramesh N |   ( Updated:2024-06-21 07:42:07.0  )
T20 World Cup: పాట్ కమిన్స్ సంచలన రికార్డు.. వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. టోర్నీలో తొలిసారి హ్యాట్రిక్ తీసిన బౌల‌ర్‌గా పాట్ కమిన్స్ రికార్డు నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ చివరి రెండు ఓవర్లలో ఈ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. సూప‌ర్‌-8లో భాగంగా ఇవాళ బంగ్లపై ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు బంగ్లాదేశ్‌ను 140 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు.

క‌మిన్స్‌తో సహా ఆసిస్ బౌలర్లు బంగ్లాకు చుక్కులు చూపించారు. 29 ర‌న్స్ ఇచ్చి కమిన్స్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్ చివ‌రి రెండు బంతుల్లో మ‌హ‌మ్మ‌దుల్లా, మ‌హేది హ‌స‌న్ వికెట్ల‌ను తీశాడు. ఆ త‌ర్వాత 20వ ఓవ‌ర్‌లో తొలి బంతికే తౌహిద్ హృద‌య్ వికెట్ తీసి త‌న పేరిట హ్యాట్రిక్ రికార్డును వేసుకున్నాడు. ఇక లెగ్ స్పిన్న‌ర్ ఆడ‌మ్ జంపా కూడా కీల‌క‌మైన రెండు వికెట్లను తీసుకున్నాడు.

బంగ్లాదేశ్ ఆటగాళ్ళు న‌జ్ముల్ హుసేన్ షాంటో 41, తౌహిద్ హృద‌య్ 40 ర‌న్స్ చేశారు. ఓపెనర్ లిట్టన్ దాస్- 16, చివర్లో తస్కీన్ అహ్మద్- 13 (నాటౌట్) పరుగులు చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. స్వ‌ల్ప టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు వర్షం అడ్డంకిగా మారింది. వ‌ర్షం వ‌ల్ల ఆట నిలిచిపోయే స‌మ‌యానికి 11.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 100 పరుగులు చేసింది. అయితే డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఆ స‌మ‌యానికి ఆస్ట్రేలియా 72 ర‌న్స్ చేసినా విజ‌యం వ‌రించింది. ఈ క్రమంలోనే డేవిడ్ వార్న‌ర్ 53 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 31 పరుగులు చేశాడు. దీంతో 28 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఆసీస్ విజ‌యం న‌మోదు చేసింది.

Advertisement

Next Story