ఐసీసీ ప్రస్తుత నాయకత్వానికి సత్తా లేదు

by Shyam |   ( Updated:2020-06-27 06:15:33.0  )
ఐసీసీ ప్రస్తుత నాయకత్వానికి సత్తా లేదు
X

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పలువురికి కీలక విషయాల్లో నిర్ణయం తీసుకొనే సత్తా లేదని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవైపు ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ నిర్వహించలేమని పదే పదే బహిరంగంగానే చెబుతున్నా ఐసీసీకి మాత్రం నిర్ణయాన్ని ప్రకటించే ధైర్యం చేయడం లేదన్నారు. కేవలం టీ20 వరల్డ్ కప్ మీదనే కాకుండా, చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నదని, సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటేనే ఐసీసీ మనుగడ సాగించగలదన్నారు. ఐసీసీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఈ జాప్యానికి గల కారణాన్ని బయటకు వెల్లడించాల్సిందేనని ఆ అధికారి డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియాలో టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని ప్రపంచానికి మొత్తం తెలుసు. కానీ, ఆ విషయం ఐసీసీకే తెలియకపోవడం బాధాకరమని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం సమావేశమైన ఐసీసీ బోర్డు టీ20 వరల్డ్ కప్, చైర్మన్ ఎన్నికపై ఎటూ తేల్చకుండానే తిరిగి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌పై స్పష్టమైన నిర్ణయం వెలువడిన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తామని గవర్నింగ్ బాడీ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed