ఐసీసీ భారీ ప్లాన్.. ఒలింపిక్స్ లక్ష్యంగా USAలో టీ20 వరల్డ్ కప్

by Anukaran |   ( Updated:2021-11-16 11:05:12.0  )
ఐసీసీ భారీ ప్లాన్.. ఒలింపిక్స్ లక్ష్యంగా USAలో టీ20 వరల్డ్ కప్
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌ను మరింత విస్తరించే దిశగా ఐసీసీ అడుగులు వేస్తున్నది. అమెరికా ఖండంలో క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకు రావాలనే ఉద్దేశంతో అక్కడ టీ20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయించింది. 2024 నుంచి 2031 వరకు 8 ఏళ్ల పాటు జరుగనున్న ఐసీసీ ఈవెంట్ల క్యాలెండర్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇందులో 2024 టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్ బోర్డుతో కలిపి అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతున్నది. నార్త్ అమెరికాలో ఐసీసీ ఒక మెగా ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. మరోవైపు క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నమీబియా తొలిసారి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్నది. 2027 వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా, జింబాబ్వేతో కలిపి నమీబియా హోస్ట్ నేషన్‌గా ఉన్నది. రాజకీయ కారణాల వల్ల కొన్నేళ్లుగా పాకిస్తాన్‌కు ఎలాంటి ఐసీసీ ఈవెంట్లు కేటాయించలేదు. అయితే ఈ సారి 2025లో చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌కు ఐసీసీ కేటాయించింది. ఇక ఎప్పటిలాగే ఐసీసీ ఈవెంట్లలో ఇండియా ఆధిపత్యం చూపించింది. ఎనిమిదేళ్లలో మూడు ఈవెంట్లకు ఇండియా వేదిక కానున్నది.

ఒలింపిక్స్ లక్ష్యంగా..

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని చాలా కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. ఐసీసీ గత కొన్నాళ్లుగా బీసీసీఐతో కలసి ఈ విషయంలో కసరత్తు కూడా చేస్తున్నది. 2028 లాస్ఏంజెల్స్‌లో ఒలింపిక్స్ జరుగనున్నాయి. దాంట్లో క్రికెట్‌ను ఈవెంట్‌గా చేర్చాడానికి ఐసీసీ బిడ్ వేయబోతున్నది. దీనికి మరింత మద్దతు కూడగట్టే లక్ష్యంతోనే 2024 టీ20 వరల్డ్ కప్‌ను అమెరికాలో నిర్వహించడానికి ఐసీసీ నిర్ణయించింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో కలిసి యూఎస్ క్రికెట్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గతంలో వెస్టిండీస్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఒకటిగా అమెరికాలోని ఫ్లోరిడాను ప్రకటించింది. అక్కడ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా నిర్వహించింది. ఆ అనుభవంతోనే అమెరికాలో మెగా ఈవెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడానికి వెస్టిండీస్ ముందుకు వచ్చింది. అమెరికాలో వరల్డ్ కప్ నిర్వహించడం ద్వారా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి మరింత మద్దతు లభిస్తుందని ఐసీసీ భావిస్తున్నది.

మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ..

ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్‌గా 1998లో ప్రారంభించి 2002లో చాంపియన్స్‌ ట్రోఫీగా మార్చిన ఈవెంట్ 2017 తర్వాత మళ్లీ నిర్వహించలేదు. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌ల వల్ల చాంపియన్స్ ట్రోఫీకి ఆదరణ కరువైందని ఐసీసీ భావించడమే కాకుండా.. బిజీ టూర్లతో దానికి సమయం దొరకకుండా పోయింది. 2021 నుంచి చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అనుకున్నా.. కోవిడ్ కారణంగా ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో చోటు దక్కలేదు. అయితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లోని టాప్ 8 దేశాలతో నిర్వహించాలని భావించిన చాంపియన్స్ ట్రోఫీని మళ్లీ తెరపైకి తెచ్చింది. 2025లో పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీని ప్రకటించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2029లో ఇండియా వేదికగా మరో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. మరి పాకిస్తాన్‌ నిర్వహించాల్సిన చాంపియన్ ట్రోఫీని ఆ దేశంలోనే నిర్వహిస్తారా లేదా యూఏఈకి తరలిస్తారా అనేది పీసీబీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

బీసీసీఐ ఆధిపత్యం..

ఇక క్రికెట్ వ్యవహారాల్లో పెద్దన్నగా ఉండే బీసీసీఐ మరోసారి ఐసీసీ ఈవెంట్లలో ఆధిపత్యం చూపించింది. 2024-31 మధ్య ఎనిమిదేళ్లలో 3 ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నది. 2026 టీ20 వరల్డ్ కప్‌ను శ్రీలంకతో, 2031 వన్డే వరల్డ్ కప్‌ను బంగ్లాదేశ్‌తో కలసి ఆతిథ్యం ఇవ్వనున్నది. క్రికెట్‌కు ఇండియాలో ఎక్కువ ఆదరణ ఉండటంతో పాటు.. ఇక్కడ నిర్వహించడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అర్జించే అవకాశం ఉండటంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బిగ్ 3 దేశాల్లో ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు ఈ ఎనిమిదేళ్లలో కేవలం ఒక్కో ఈవెంట్ మాత్రమే దక్కాయి. మరోవైపు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వేదికలను కూడా ఐసీసీ ప్రకటించాల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed