ఐపీఎల్‌కు అంపైర్ల కరువు

by Shyam |
ఐపీఎల్‌కు అంపైర్ల కరువు
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఐసీసీ అంపైర్లు దూరమయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లు ఈ సీజన్‌లో అందుబాటులో ఉంటారని బీసీసీఐ భావించింది. కానీ, కరోనా భయాందోళన మధ్య చాలా మంది అంపైర్లు బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి జవగళ్ శ్రీనాథ్ మాత్రం రిఫరీగా వ్యవహరించడానికి అంగీకరించారు.

ఐసీసీ అంపైర్లైన న్యూజీలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మైఖేల గాఫ్‌లు మాత్రం ఐపీఎల్ బాధ్యతలకు అంగీకరించినట్టు తెలుస్తున్నది. ఐపీఎల్‌లో ఎప్పుడూ కనపడే శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన ఈ సారి సీజన్‌కు రాలేనని తేల్చి చెప్పారు. ఐపీఎల్ కోసం కనీసం 12 మంది అంపైర్లైనా కావాల్సి ఉంటుంది. ఈ లీగ్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జరుగుతుంది కాబట్టి ఐసీసీ అంపైర్లనే బీసీసీఐ నియమిస్తూ ఉంటుంది.

కానీ ఈ సారి కేవలం విదేశీలకు చెందిన ముగ్గురు ఎలైట్ ప్యానల్ అంపైర్లతోనే సరిపెట్టాల్సి ఉంది. ఇక ఇండియాకు చెందిన ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు అంతర్జాతీయ అంపైర్లు అనిల్ చౌదురి, సి.సంషుద్దీన్, వీరేంద్ర శర్మ, కేఎన్. అనంతపద్మనాభన్, మాజీ ఎలైట్ ప్యానల్ సభ్యుడు సుందరం రవి ఐపీఎల్ బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించారు. 12 మంది అంపైర్లు ఆన్‌ఫీల్డ్, టీవీ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ముగ్గురు మాత్రం కేవలం ఫోర్త్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed