ఐసీసీ కౌన్సిల్ సీఈవో‌పై ఆరోపణలు.. రాజీనామా చేస్తాడా..!

by Shiva |   ( Updated:2021-03-10 06:52:28.0  )
ఐసీసీ కౌన్సిల్ సీఈవో‌పై ఆరోపణలు.. రాజీనామా చేస్తాడా..!
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ముసలం ఏర్పడింది. కౌన్సిల్ సీఈవో మనూ సాహ్ని దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. ఆయన ఐసీసీ కార్యాకలాపాల కన్నా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగులపై పెత్తనం చేస్తున్నట్లు ఒక దర్యాప్తులో తేలింది. ఈ విషయంపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సాహ్నీని వెంటనే సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసే వరకు ఆయన ఐసీసీకి అందుబాటులో ఉండాలని.. కానీ ఆయన సీఈవో పదవి మాత్రం సస్పెన్షన్‌లో ఉంటుందని తేల్చిచెప్పింది. మనూ సాహ్నీపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసే లోపు ‘మర్యాద పూర్వక రాజీనామా’కు ఆయన సహకరిస్తే ఆమోదించేందుకు ఐసీసీ సిద్ధంగా ఉన్నది. అలా కాకుండా ఆయన మొండికి వేస్తే మాత్రం పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.

ఏమిటీ వివాదం..?

ఐసీసీ ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ప్రపంచకప్ వరకు డేవ్ రిచర్డ్సన్ అనే వ్యక్తి సీఈవో పదవిలో ఉన్నారు. 2019లో ఆయన పదివీ కాలం ముగిసి వెళ్లిపోవడంతో ఆయా స్థానంలో మనూ సాహ్నీని సీఈవోగా నియమించారు. నిబంధనల ప్రకారం 2022 వరకు సాహ్నీ ఈ పదవిలో కొనసాగాల్సి ఉన్నది. కానీ.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సాహ్నీ ఐసీసీ ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు, ఇతర క్రికెట్ బోర్డులతో కూడా వైరం పెంచుకుంటున్నట్లు తెలిసింది. దీనిపై ఐసీసీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రైస్ వాటర్ కూపర్ అనే సంస్థను దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ సంస్థ దర్యాప్తునకు సంబంధించి మధ్యంతర నివేదికను ఐసీసీకి సమర్పించింది. మనూ సాహ్నీ దురుసు ప్రవర్తన నిజమేనని.. ఇతర బోర్డుల వ్యవహారాల్లో కూడా ఆయన తలదూరుస్తున్నారని… ముఖ్యంగా ఐసీసీ చైర్మన్ ఎన్నిక సమయంలో ఏకపక్షంగా వ్యవహరించినట్టు నివేదికలో పేర్కొన్నాడు. దీంతో సాహ్నీని సెలవుపై వెళ్లాలని ఐసీసీ ఆదేశించింది.

బిగ్ 3కి వ్యతిరేకంగా..

ఐసీసీలో బిగ్ 3గా పిలువబడే బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియాలకు వ్యతిరేకంగా సాహ్నీ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఆయనను సీఈవోగా కొనసాగించడం బిగ్ 3 బోర్డులకే కాకుండా ఇతర క్రికెట్ బోర్డులకు కూడా ఇష్టం లేదని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు. ఇటీవల జరిగిన ఐసీసీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మనూ సాహ్నీ తటస్థంగా ఉండకుండా ఎన్నికల్లో నిలబడిన తాత్కాలిక చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు మద్దతు ఇచ్చారు. ఆయనకు అనుకూలంగా ఓటేయమంటూ పలువురు బోర్డు సభ్యులను ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తున్నది. ఆస్ట్రేలియా, ఇండియా బోర్డుల మద్దతుతో న్యూజీలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే ఎన్నికల్లో నిలబడ్డారు. కానీ మనూ సాహ్నీ అతడికి వ్యతిరేకంగా వ్యవహరించారు.

ఈ విషయంపై అప్పట్లోనే బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు మనూ సాహ్నీకి వ్యతిరేకంగా దర్యాప్తును ఆదేశించడంలో కూడా బీసీసీఐ పాత్ర ఉన్నది. పెద్ద బోర్డులకు వ్యతిరేక కార్యాకలాపాలు సాగిస్తున్న మనూ సాహ్నీని తొలగించడానికి పావులు కదుపుతున్నారు. సాహ్నీ రాజీనామా చేయకపోతే బోర్డు సమావేశమై ఆయనను తొలగించడానికి నిర్ణయం తీసుకోనున్నది. ఇందుకు గాను బోర్డులో ఉన్న 17 మంది డైరెక్టర్లలో 12 మంది అంగీకరించాల్సి ఉన్నది. అయితే మనూ సాహ్నీ రాజీనామా చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed