పోర్టబిలిటీలో హైదరాబాదే టాప్ !

by Shyam |   ( Updated:2020-04-12 10:50:27.0  )
పోర్టబిలిటీలో హైదరాబాదే టాప్ !
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధాని మోడీ మార్చి 22న జనత కర్ఫ్యూకు పిలుపునిచ్చిన మరుసటి రోజు నుంచే అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఎక్కడి వాళ్లక్కడే నిలిచిపోయారు. ప్రభుత్వ శాఖల్లో అత్యవసర విభాగాలు మినహా మిగతా సంస్థలన్నీ బంద్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముఖ్యంగా రోజువారీ పనులకు వెళ్తూ పొట్ట నింపుకునే పేదలు, వలస కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారు. వీరి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల నిమిత్తం రేషన్ కార్డు కలిగిన వారికి రూ.1500, వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ..

హైదరాబాద్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ పరిధిలో 9 సర్కిళ్ళ వారీగా 5.80 లక్షల ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో ఉన్న వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ.500లను అందజేశారు. అనంతరం జిల్లాకు చెందిన కార్డుదారులకు బియ్యం పంపిణీ ప్రారంభించారు. ప్రస్తుతం బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన కార్డుదారులకు కూడా నగరంలోని రేషన్ దుకాణాల వద్ద పోర్టబిలిటీ పద్ధతిలో రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ జరుగుతోంది. అయితే, మన రాష్ట్రానికి చెందిన వారికి రూ.1500లు రావాల్సి ఉన్నందున ఇతర జిల్లాలకు చెందిన వారు రేషన్ డీలర్లకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లను అందజేస్తున్నారు. అయితే, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేస్తే, ఆ తర్వాత వేలి ముద్రలు వేసేవారికి కరోనా సోకే ప్రమాదం ఉన్నందున సంబంధిత రేషన్ డీలర్లే.. రేషన్ కార్డు, ఆధార్ నంబర్లతో పోర్టబిలిటీ లబ్దిదారుల పేర్లను పరిశీలించిన పిదపనే బియ్యం అందజేస్తారు.

పోర్టబిలిటీలో హైదరాబాద్ టాప్:

జిల్లాలోని 9 సర్కిళ్ళ పరిధిలో ఇప్పటి వరకు 4 లక్షల 27 వేల 395 మంది లబ్దిదారులు బియ్యం తీసుకున్నారు. ఇంకా 1.53 లక్షల కార్డుదారులు రేషన్ తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా పోర్టబిలిటీ ద్వారా 13 లక్షల కార్డుదారులు వేర్వేరు ప్రాంతాల్లో బియ్యం తీసుకున్నారు. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే 2.42 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా రేషన్ పొందారు. దీంతో పోర్టబిలిటీ ద్వారా బియ్యం అత్యధికంగా తీసుకున్న వారిలో హైదరాబాద్ జిల్లా టాప్ లో నిలిచింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 1.36 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 1.95 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందారు. ఇప్పటి వరకు మొత్తం 88 శాతం బియ్యం పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరు వరకు బియ్యం పంపిణీ ఉంటుందని చెప్పడంతో.. మరికొద్ది రోజుల్లో 100 శాతం పంపిణీ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags: corona effect, corona rice distribution, civil supplies, hyderabad, hyderabad ration shops

Advertisement

Next Story

Most Viewed