ఊరు మారినా…మారని అదృష్టం

by Sumithra |
ఊరు మారినా…మారని అదృష్టం
X

దిశ, క్రైమ్ బ్యూరో : దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు పేరుమోసిన నేరస్తులు స్నేహితులుగా మారారు. ముంబయిలో దొంగతనాలకు పాల్పడితే స్థానిక పోలీసులు గుర్తించి అరెస్ట్ చేస్తారంటూ దొంగలు మకాంను హైదరాబాద్‌కు మార్చారు. నగరానికి వచ్చీ రాగానే మియాపూర్ రిలయల్స్ డిజిటల్‌లో భారీగా 119 సెల్‌ఫోన్లను దొంగతనం చేసి ముంబయికు పరారయ్యారు. దొంగతనం సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు.. ముంబయి పోలీసుల సహకారంతో నలుగురు సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముంబయికు చెందిన పాండురంగాకు మహ్మద్ తబ్రేజ్ దౌడ్ షేక్ జైలులో పరిచయమయ్యాడు.

ముంబయిలో దొంగతనాలు చేస్తే పోలీసులు పట్టుకుని అరెస్టు చేస్తారని భావించిన వీరు దొంగతనాలను హైదరాబాద్ కేంద్రంగా చేయాలని భావించారు. వీరితో పాటు మరో ముగ్గురిని కలుపుకొని ఓ ఇన్నోవాను అద్దెకు తీసుకుని గత నెల 13న రాత్రి 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ రాగానే ఫేక్ నెంబరు అమర్చారు. మియాపూర్ వద్ద రిలయన్స్ డిజిటల్ కన్పించింది. షట్టర్ తొలగించడంలో పేరొందిన ఈ దొంగలు.. వారి వద్దనున్న గడ్డపారతో షట్టర్‌ను తొలగించి (14వ తేదీ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో) లోపలికి ప్రవేశించారు. ఆ షాపులో ఉన్న వివిధ కంపెనీలకు చెందిన విలువైన సెల్ ఫోన్లను బస్తాలతో వేసుకుని తిరిగి వెళ్లిపోయారు. పోతూపోతూ ఓ వైన్స్ షాపులో 3 ఫుల్ బాటిళ్ల మద్యం సీసాలతో పాటు రూ.4 వేల రూపాయలను చోరీ చేసి అక్కడి నుంచి తిరిగి ముంబయి చేరుకున్నారు.

అయితే, చోరీ జరిగిన రోజు తెల్లవారు జామున డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారు వినియోగించిన ఇన్నోవా కారుకు ఫేక్ నెంబరు అమర్చినట్టు గుర్తించారు. ముంబయి పోలీసుల సహకారంతో కేసు దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు మహ్మద్ తబ్రేజ్ దౌడ్ షేక్, ఫర్హాన్ ముంతాజ్ షేక్, రషీద్ మహ్మద్ షేక్, మహ్మద్ సుఫియాన్ షేక్, రాజు పాండురంగ్ లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వీరి నుంచి సుమారు రూ.30 లక్షల విలువ చేసే 113 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed