హైదరాబాద్ మెట్రోలో ‘కరోనా’ ప్రయాణం

by Anukaran |
Hyderabad Metro
X

దిశ, తెలంగాణ బ్యూరో: మీరు మెట్రోలో ప్రయాణిస్తున్నారా.. అయితే మీతో పాటు కరోనా కూడా ప్రయాణిస్తున్నట్టే.. కొవిడ్ రెండో వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కరోనా నిబంధనలు పాటించకుండా హైదరాబాద్ మెట్రో సర్వీసులు నడుస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

మెట్రో సర్వీసుల్లో నిత్యం సుమారు లక్ష మంది వరకూ ప్రయాణిస్తున్నారు. గతంలో నాలుగు లక్షల మంది ప్రయాణించిన మెట్రోల్లో కరోనా తర్వాత ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం సిటీలో కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గ్రేటర్ నగరంలో అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని మెజారిటీ ప్రజలకు అందిస్తున్న మెట్రోలో కొవిడ్ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. గతేడాది కరోనా వైరస్ మొదటి వేవ్ సమయంలో మెట్రో సమర్థవంతంగా తన సేవలందించింది. ప్రతీ సర్వీసు చివరి స్టేషన్ చేరుకున్నపుడు అక్కడ బోగీలను పూర్తిగా శానిటైజేషన్ చేసి రిటర్న్ ట్రిప్‌కు పంపించేవారు. ప్రస్తుతం అలాంటివి అమలు కావడం లేదు. మొన్నటి వరకూ బోగిల్లోనూ భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేసిన హెచ్ఎంఆర్ తర్వాత అది కూడా పాటించడం లేదు.

ప్రయాణికులు సాధారణ సమయాల్లో మాదిరిగానే దగ్గరదగ్గరగానే కూర్చుంటున్నారు. ప్రస్తుత ఆర్టీసీ సర్వీసులు తగ్గడం, ఎంఎంటీఎస్ ప్రారంభం కాకపోవడంతో మెట్రోను ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రతీ రోజూ 56 మెట్రో స్టేషన్లలో లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలన్న ఆలోచన కూడా మెట్రో అధికారులకు రావడం లేదు. లిఫ్ట్‌లు, ఎస్కూలేటర్లను శానిటైజ్ చేయడం కూడా కనిపించడం లేదు. మెట్రో ఫ్లాట్ ఫారాల వద్దకు వెళ్లే ఎంట్రీల వద్ద మాత్రం శానిటైజ్ డబ్బాలను ఏర్పాటు చేశారు తప్ప ప్రతీ ప్రయాణీకుడు వాటిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టలేదు. నిజానికి మెట్రో స్టేషన్ల పైకి చేరుకునేటప్పుడే శానిటైజేషన్ చేయడం, మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రయాణీకులకు భద్రత కల్పించినట్టవుతుంది.

ఒక్కో ప్రయాణంలో వందల మంది ఒక బోగిలో ఉంటారు. మెట్రో స్టేషన్లు, రైళ్లలోనూ ఏసీ సౌకర్యం ఉండటం వల్ల.. ఏదైనా వైరస్ ప్రవేశిస్తే అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వ్యాపిస్తుంది. అనుకోకుండా పాజిటివ్ వ్యక్తి, వైరస్ అనుమానిత లక్షణాలను గుర్తించడంలో విఫలమైతే మెట్రో సర్వీసుల్లో ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది. మెట్రో స్టేషన్లలో అన్నిటిలో థర్మల్ స్క్రీనింగ్ కూడా లేకపోవడం గమనార్హం.. నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వీసులందిస్తున్న మెట్రోల్లో కొవిడ్ వైరస్‌పై నిర్లక్ష్యం కనిపిస్తుండటం గమనార్హం.. మెట్రో ద్వారా కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందడం మొదలైతే.. లక్షల మంది పాజిటివ్ వస్తుంది. హైదరాబాద్ మెట్రోకు, నగరానికి కూడా అది మాయని మచ్చగా మారనుంది. మెట్రో ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొనైనా హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల రక్షణ కోసం కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Next Story