హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ట్రాక్ రికార్డ్..

by Shyam |   ( Updated:2021-12-25 06:40:00.0  )
cp
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీపీగా ఉన్న అంజనీకుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసి ఆయన స్థానంలో సీవీ ఆనంద్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను విభజన తర్వాత తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో తొలి పదేళ్లపాటు ఏఎస్పీగా, ఎస్పీగా పనిచేశారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల నుండి ఆయన చాలా సార్లు తప్పించుకున్నారు. 2002వ సంవత్సరంలో రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్‌ అందుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఈస్ట్, సెంట్రల్ జోన్లలో డీసీపీగా 3 ఏళ్లు, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా రెండేళ్లు, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ కమిషనర్‌గా మూడున్నర ఏళ్లు పని చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్‌కు మొదటి డీసీపీగా నియమించబడ్డారు. హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల మెరుగైన పోలీసింగ్‌ను తీసుకురావడానికి సీవీ ఆనంద్ 2002 మే నెలలో ‘లేక్ పోలీస్’ని స్థాపించారు. దీని ద్వారా పరోక్షంగా అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది ప్రాణాలను రక్షించిన వారయ్యారు. సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందిన ఆయనను నగర పోలీస్ కమిషనర్ గా నియమించడంతో పోలీస్ శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ ను పరిచయం చేసిన అధికారిగా గుర్తింపు..

మద్యం సేవించి వాహనాలను నడిపే వారిని కట్టడి చేయడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మొదటగా ప్రారంభించిన ఘనత సీవీ ఆనంద్ కే దక్కింది. 2010 నుండి 13 వరకు అదనపు కమిషనర్ గా పని చేసే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం అనేక ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టారు. ‘ఫ్రీ లెఫ్ట్‌లు, రివర్సిబుల్ ట్రాఫిక్ లేన్స్, ఇ-చలానాలు అందుబాటులోకి తేవడంతో పాటు చలానాలను ఆన్ లైన్ చేశారు. అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, అధికారులకు హ్యాండ్‌హెల్డ్ కెమెరాలను అందించారు,. తద్వారా ఇ-చలాన్‌తో పాటు ఫోటోగ్రాఫిక్ ఆధారాలు కూడా వాహనదారులకు అందుతున్నాయి. వేగ నియంత్రణ కోసం స్పీడ్‌ గన్‌లను ప్రవేశపెట్టారు.

ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు వేతనం ఇవ్వాలని ఆయన 2012లో ప్రతిపాదించగా, 2015లో ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర విభజన ఉద్రిక్తత సమయంలో మూడేళ్లపాటు సైబరాబాద్ సీపీగా పనిచేసిన ఆనంద్, రాచకొండ, సైబరాబాద్‌లుగా విడిపోయిన తర్వాత పాత సైబరాబాద్‌కు చివరి సీపీగా పనిచేశారు. 2 సంవత్సరాలు సివిల్ సప్లైస్ కమీషనర్‌గా పోలీసు శాఖ వెలుపల కూడా సీవీ ఆనంద్ పని చేశారు. పౌరసరఫరాల శాఖలో ఇ-పీడీఎస్‌ను ప్రవేశపెట్టారు. అతని ఐటీ, సాంకేతిక సంస్కరణలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టర్లు, రేషన్ షాపు డీలర్ల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించడం ద్వారా ప్రభుత్వానికి 2 యేండ్లలో రూ. 2 వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టాయి.

జాతీయ స్థాయిలో ప్రశంసలు ..

సీవీ ఆనంద్ 2018 ఏప్రిల్‌లో సీఐఎస్‌ఎఫ్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఐజీగా ఎయిర్‌పోర్ట్ సెక్టార్‌‌లో రెండున్నర సంవత్సరాలు పనిచేశారు. అన్ని విమానాశ్రయాలలో టర్నోవర్ నిష్పత్తులను మెరుగుపరిచాడు. ఒక ఏడాది నిసా (ఎన్ఐఎస్ఏ) డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు.

అంతేకాకుండా గుర్రపు స్వారీపై ప్రత్యేక మాడ్యూల్స్‌తో అసిస్టెంట్ కమాండెంట్లు, సబ్ ఇన్‌స్పెక్టర్‌ల ప్రాథమిక శిక్షణను కొత్త స్థాయికి తీసుకువెళ్లారు. గ్యాలంట్రీ మెడల్, ఐపీఎం, పీపీఎం, పోలీస్‌లో ఆంత్రిక్ సురక్షా మెడల్ వంటి అనేక పతకాలను గెలుచుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తమ పనితీరుకు భారత ఎన్నికల కమిషన్ నుండి జాతీయ అవార్డు, నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డు వంటివి అందుకున్నారు. ఇవే కాకుండా ఇతర ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలతో పాటు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు-2017 అందుకున్నారు.

క్రీడలలో ప్రతిభ..

నగర నూతన సీపీ సీవీ ఆనంద్ మంచి క్రీడాకారుడు. హైదరాబాద్ స్టేట్ తరపున అన్ని స్థాయిలలో క్రికెట్ ఆడారు. ఐపీఎస్‌లో చేరడానికి ముందు అండర్ 19 జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. జాతీయ పోలీసు అకాడమీలో 100, 200 మీటర్లతో పాటు, హై-లాంగ్-ట్రిపుల్ జంప్‌లను గెలుచుకున్నాడు. మంచి టెన్నిస్ క్రీడా కారుడుగా ఆయనకు గుర్తింపు ఉంది.

Advertisement

Next Story

Most Viewed